జోగులాంబ ఆలయంలో అవినీతిపై విచారించాలి

జోగులాంబ ఆలయంలో అవినీతిపై విచారించాలి
  • దేవాదాయశాఖ ఆఫీస్​ ముందు హిందూ ధార్మిక సంఘాల ఆందోళన

బషీర్​బాగ్, వెలుగు: అలంపూర్  జోగులాంబ ఆలయ ఈవో పురేందర్, ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ అవినీతిపై విచారణ జరపాలని హిందూ ధార్మిక సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. మంగళవారం హైదరాబాద్​ బొగ్గులకుంటలోని  దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్  కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కొత్తకోట ఆశ్రమ అర్చకుడు శివానంద స్వామి మాట్లాడుతూ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్  జోగులాంబ ఆలయ పవిత్రతను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 

ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మపై క్రిమినల్ కేసులు ఉన్నందున, ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్  చేశారు. మూడు నెలలుగా ఆనంద్  శర్మపై అవినీతి ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆలయంలోని ఆభరణాలు మాయం తదితర అంశాలపై విచారణ జరిపించాలన్నారు. అలంపూర్  వీహెచ్​పీ నేతలు వెంకటేశ్వర్లు, సి.రంగస్వామి, కె.సురేశ్, చక్రవర్తి, వేదన్ పాల్గొన్నారు.