హైదరాబాద్,వెలుగు: రాష్ట్ర సర్కారు ఆదేశాలతో ప్రభుత్వ భూముల పర్యవేక్షణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆయా భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేసి, లోపల ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించారు. ఇనుప కంచె ఏర్పాటు చేయగానే అర్బన్ ఫారెస్ట్రీ కింద మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు రెడీ అవుతున్నారు.
హెచ్ఎండీఏ పరిధిలోని లక్షల కోట్ల విలువజేసే వేల ఎకరాల భూములను పరిరక్షించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో భూబకాసురులు విలువైన భూముల్లో పాగా వేసి, కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో ఆయా భూములను విడిపించేందుకు అధికారుల తలప్రాణం తోకకు వచ్చింది. కబ్జాదారులు కొందరు ముఠాలుగా ఏర్పడి హెచ్ఎండీఏ స్థలాల్లో ముందుగా చిన్న చిన్నషెడ్లు వేసి వివాదాల్లోకి లాగుతున్నారు. కొందరైతే వాళ్లే ఉల్టా కేసులు పెట్టి, లేని పోని అపోహలు సృష్టిస్తూ ఆఫీసర్లనే బెదిరింపులకు గురిచేస్తున్నారు. జాగలు ఖాళీగా ఉండడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటున్నదని తెలియడంతో సర్కారు ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ల్యాండ్‌బ్యాంకును కాపాడుకునేందుకు ఆఫీసర్లు రంగంలోకి దిగారు.
భూములు కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు దాకా..
హెచ్ఎండీఏ పరిధిలోని 7 జిల్లాలు, 70 మండలాలు, 30 మున్సిపాలిటీల పరిధిలోని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్అథారిటీకి వేల కోట్ల విలు వజేసే వందల ఎకరాల భూములున్నాయి. అవన్నీ ఖాళీగా ఉండడంతో కొందరు అక్రమార్కులు ముఠాలుగా ఏర్పడి, రకరకాల మార్గాల్లో కబ్జాలకు పాల్పడుతున్నారు. రాజకీయ పలుకుబడి ఉండడంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేశారు. గత ప్రభుత్వ హయాంలో జవహర్‌నగర్‌లోని హెచ్ఎండీఏ భూములను కబ్జా చేసిన కేసులో ఓ కార్పొరేటర్ హస్తం ఉన్నట్టు బయటపడింది. ఇక్కడ కబ్జాదారుల చెర నుంచి భూములను కాపాడుకోవడం హెచ్ఎండీఏ అధికారులకు తలకు మించిన భారమైంది. ఇక శంషాబాద్‌లో ఓ వ్యక్తి ఏకంగా 50 ఎకరాల హెచ్ఎండీఏ భూములను కబ్జా చేయడంతో వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. చివరకు కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో కథ సుఖాంతమైంది. ఇక మియాపూర్‌లోనూ కొన్ని భూముల్లో కొందరు అక్రమంగా ఇండ్లు నిర్మించుకోవడం వివాదాస్పదమైంది. ఇలా హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో ఎక్కడో చోట సర్కారు భూములు కబ్జాలకు గురవుతూనే ఉన్నాయి. ఖాళీగా ఉండడం వల్లే కబ్జాలకు గురవుతున్నాయని ఎప్పటి నుంచో అధికారులు చెప్తున్నా ..నాటి పాలకులు పట్టించుకోలేదు. ఇటీవల హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్ సమావేశం కాగా, ఇదే విషయాన్ని ఆఫీసర్లు ఆయన దృష్టికి తెచ్చారు. హెచ్ఎండీఏ ల్యాండ్‌బ్యాంక్‌లో ఉన్న వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో భూములన్నింటినీ సంరక్షించాలని, ఏ రాజకీయ ఒత్తిళ్లకూ లొంగవద్దని, ఖర్చుకు వెనకాడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దీంతో భూముల చుట్టూ ఇనుప కంచెలువేసి, అర్బన్‌ఫారెస్ట్రీ తరఫున మొక్కలు నాటించాలని అధికారులు నిర్ణయించారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని భూములను పరిరక్షించుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు.
కొన్ని భూముల్లో లేఅవుట్స్
హెచ్ఎండీఏకు ఉన్న వందలాది ఎకరాల భూములను కాపాడుకోవడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఇకపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల హెచ్ఎండీఏ లేఅవుట్స్వేసి.. వాటిని వేలం వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లకు మంచి డిమాండ్ వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా హెచ్ఎండీఏ భూముల వేలం, ల్యాండ్‌పూలింగ్ ద్వారా వెంచర్లు వేసి ఆదాయం పెంచుకోవాలని సూచించారు. అందులో భాగంగానే భూముల సంరక్షణ, ప్రాజెక్టులు, ఆదాయం అనే మూడు లక్ష్యాలతో ముందుకెళ్తున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు.