
హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ.60 వేల కోట్ల విలువై వస్తువుల అమ్మకం జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. స్వీట్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్టులు, గిఫ్టులు, డ్రైఫ్రూట్స్, దుస్తులు, పువ్వులు, పండ్లు, కన్జూమర్ డ్యూరబుల్స్ వంటివి పెద్ద ఎత్తున అమ్ముడవుతాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 20 శాతం ఎక్కువ ఉంటాయని అంచనా.
న్యూఢిల్లీ:హోలీ పండుగ మనలోనే కాదు.. ఎకానమీలోనూ జోష్ నింపుతోంది. దేశవ్యాప్తంగా రూ.60 వేల కోట్ల విలువైన బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని కాన్ఫిడరేషన్ఆఫ్ఆలిండియా ట్రేడర్స్(సీఏఐటీ) వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 20 శాతం పెరుగుతాయని అంచనా.
స్వీట్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్టులు, గిఫ్టులు, డ్రైఫ్రూట్స్, దుస్తులు, పువ్వులు, పండ్లు, కన్జూమర్ డ్యూరబుల్స్ వంటివి పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నాయి. పోయిన ఏడాది మాదిరే ఈసారి కూడా చాలా మంది ట్రేడర్లు, కస్టమర్లు చైనా వస్తువులను కొనడం లేదు.
మనదేశంలోనే తయారైన హెర్బల్ కలర్స్, గులాల్, బెలూన్లు, దుస్తులు, పూజా సామగ్రి, వాటర్‌గన్స్, శాండల్‌వుడ్ కొనడానికి మొగ్గుచూపుతున్నారు. దీనివల్ల వీటి తయారీ సంస్థలకు ఎంతో మేలు జరుగుతోంది. హోలీ ఆడటానికి వాడే టీ–-షర్టులు, కుర్తా-పైజామాలు, సల్వార్ సూట్లకు కూడా అధిక డిమాండ్ ఉందని వ్యాపారుల సంఘం తెలిపింది. 'హ్యాపీ హోలీ' అని రాసి ఉన్న టీ–-షర్టులకు కూడా మార్కెట్లో గిరాకీ బాగుంది. సీఏఐటీ డేటా ప్రకారం గత సంవత్సరం హోలీ నాడు రూ. 50 వేల కోట్ల విలువైన వస్తువులు అమ్ముడయ్యాయి.
ఢిల్లీలోనే రూ.వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. దేశ రాజధానిలో భారీ ఎత్తున హోలీ సంబరాలు నిర్వహించడమే ఇందుకు కారణమని కాన్ఫిడరేషన్ సెక్రటరీ జనరల్, చాందినీచౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్అన్నారు. నగరవ్యాప్తంగా మూడు వేల హోలీ మిలన్ వేడుకలు జరుగుతాయని వివరించారు. అందుకే ఇక్కడి షాపుల్లో జనం విపరీతంగా కనిపిస్తున్నారని అన్నారు. హోలీ లోకల్వ్యాపారులకు, చిన్న ట్రేడర్లకు, చిన్న ఇండస్ట్రీలకు.. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ఎంతో మేలు చేస్తోందని ప్రవీణ్ వివరించారు.
హోటళ్లకూ రద్దీ
పండుగనాడు కుటుంబాలు, స్నేహితులు కలిసి భోజనం చేయడం, వినోద కార్యక్రమాలకు వెళ్లడం వంటి సామాజిక కార్యకలాపాలు పెరుగుతాయి. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు వినోద పరిశ్రమల ఆదాయం పెరుగుతుంది. హోలీ వేడుకలు మనదేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేకంగా ఉంటాయి. విదేశీ, దేశీయ పర్యాటకులు ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. ఇది పర్యాటక రంగానికి ఊతమిస్తోంది. పర్యాటకుల రాకతో హోటళ్లు, రవాణా, స్థానిక దుకాణాలు, ఇతర పర్యాటక సంబంధిత వ్యాపారాలు లాభపడుతున్నాయి.
హోలీ సమయంలో తాత్కాలిక ఉద్యోగాలు పెరుగుతాయి. రంగులు, స్వీట్లు, ఇతర వస్తువుల తయారీ, విక్రయం, పంపిణీ అనేక మందికి ఉపాధి లభిస్తుంది. పర్యాటక రంగం వృద్ధి చెందడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లలో, రవాణా రంగాలలో కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హోలీ సమయంలో చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు అధికంగా లాభపడతాయి. పండుగ సందర్భంగా ప్రయాణాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి రవాణా రంగానికీ మేలు జరుగుతుంది.