హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూతతో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు దినం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.
మన్మోహన్ సింగ్ గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించనున్నట్టు గురువారం రాత్రి అధికారిక వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం కేంద్ర కేబినెట్ ఈ మేరకు సమావేశమై సంతాప దినాలు, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల వివరాలను వెల్లడించనున్నట్టు తెలిపాయి.
కేబినెట్ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసులపై జాతీయ జెండాను అవనతం చేయనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఏడు రోజులపాటు సంతాప దినాలను పాటించనుంది. ఇందులో భాగంగా పార్టీ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నది. కాంగ్రెస్ ఆఫీసులపై పార్టీ జెండాను కూడా అవనతం చేయనుంది.