న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై–-సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్‌లో నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు 7 శాతం పెరిగి 19,527 యూనిట్లకు చేరుకున్నాయని రియల్ఎస్టేట్ కంపెనీ స్క్వేర్ యార్డ్స్ తెలిపింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సెప్టెంబరు క్వార్టర్లో బలమైన పనితీరును కనబరుస్తూ వృద్ధి సాధిస్తూనే ఉందని పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో 18,314 యూనిట్లు నమోదయ్యాయి.
సెప్టెంబర్ క్వార్టర్లో, మొత్తం నమోదిత అమ్మకాల విలువ రూ. 11,718 కోట్లకు పెరిగింది. ఇది సంవత్సరానికి 20 శాతం పెరుగుదలను సూచిస్తుంది. స్క్వేర్ యార్డ్స్ ప్రిన్సిపల్ పార్టనర్, సేల్స్ డైరెక్టర్ దేవయాన్ భట్టాచార్య మాట్లాడుతూ ఐటీ రంగంలో వృద్ధి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ పెరిగిన కారణంగా హైదరాబాద్ మార్కెట్బలోపేతమవుతోందని చెప్పారు. గచ్చిబౌలి, మాదాపూర్‌తోపాటు కోకాపేట్, నార్సింగి ఔటర్ రింగ్ రోడ్‌కు సమీపంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.