ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తిసుకోవాలి: గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టామని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ​తెలిపారు. శనివారం ఐడీఓసీలోని మీటింగ్ హాల్ లో సీపీ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్లు డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగకుండా  పకడ్బందీ ర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ 18, జిల్లా యంత్రాంగం 15 చెక్ ​పోస్టులు ఏర్పాట్లు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు.

ఎన్నికల్లో బ్యాంకింగ్ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. మండల పరిధిలో ఓటర్లకు డిజిటల్​ పేమెంట్​ చేస్తూ  ప్రలోభాలకు గురిచేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశామని చెప్పారు. గిఫ్టులను పట్టుకొని సీజ్​ చేశామన్నారు. ముక్కు పుడకలు, చెవి కమ్మలు, వెండి ఆభరణాలు బహుమతులుగా ఇస్తున్నట్లు దృష్టికి వస్తున్నదన్నారు. బల్క్ గా ఆభరణాలు కొనుగోళ్లు జరిగితే జువెల్లరి షాప్ యజమానులు ఎన్నికల అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. ఎలాంటి అక్రమాలు, ఉల్లంఘనలు ఉన్నా ఓటర్లు సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పారు. 

సమన్వయంతో పని చేయాలి 

అధికారులు సమన్వయంతో ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. శనివారం పోలీస్ కమిషనర్ తో కలిసి నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్​లో పోలీస్, బ్యాంకర్లు, ఇన్ కం ట్యాక్స్ అధికారులతో ఎన్నికల్లో సమావేశం ఏర్పాటు చేశారు. డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువులను గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లల్లో నిల్వలు ఉంచే అవకాశం ఉన్నందున తనిఖీలు చేపట్టాలన్నారు. 

స్వీప్ ప్రోగ్రామ్​లో అధికారులు

సిటీలోని లకారం ట్యాంక్ బండ్ లోని ఎన్టీఆర్ పార్క్ లో నిర్వహించిన స్వీప్ ప్రోగ్రాం లో శనివారం  జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, ఎన్నికల పోలీస్ పరిశీలకులు బ్రిజేష్ కుమార్ రాయ్, ఖమ్మం మున్సిపల్​కమిషనర్ ఆదర్శ్ సురభి పాల్గొని ఓటు హక్కుపై చైతన్యం కల్పించారు.స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖమ్మం, పాలేరు అసెంబ్లీ ఎన్నికల సాధారణ పరిశీలకులు తుషార్ కాంతా మహంతి సూచించారు. పార్క్ లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ లో ఫొటోలు దిగారు. స్వీప్ సంతకాల సేకరణ లో భాగంగా సంతకాలు చేశారు. ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఓటరు అవగాహన సాంస్కృతిక కార్యక్రమాలుఆకట్టుకున్నాయి.