తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలకు పోటెత్తిన భక్తులు

కొడంత జనం ఏడుకొండలకు తరలివస్తున్నారు. తిరుమల వెంకన్న దర్శనానికి తరలివస్తున్న భక్తులతో ఏడుకొండలు సందడిగా మారాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసినా.. భక్తులు అనూహ్యంగా తిరుమలకు పోటెత్తారు. తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాసి మాసం ముడో వారం కావడంతో జనాలు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిండి రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. వేంకటేశ్వరుని దర్శనానికి దాదాపు రెండ్రోజుల సమయం పడుతోంది. సర్వ దర్శన క్యూలైన్లలో టిటిడి కొన్ని మార్పులు చేపట్టింది. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డు గుండా నారాయణగిరి షెడ్లలోకి భక్తులు ప్రవేశించేలా క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. గతంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్​లు, నారాయణగిరి షెడ్లల్లో భక్తులు నిండితే ఏటిసి, ఎస్.ఎం.సి, లేపాక్షి, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్, ఇలా వెంకమాంబ అన్న సత్రాల వరకు క్యూ లైన్ ద్వారా టీటీడీ భక్తులకు స్వామివారి దర్శనం చేయించేది.

అన్నీ కంపార్ట్ మెంట్లు ఫుల్

ఇప్పుడు సర్వ దర్శన భక్తులను ఔటర్ రింగ్ రోడ్డు కొత్తగా క్యూలైన్లను ఏర్పాటు చేసి భక్తులను వైకుంఠ కాంప్లెక్స్​లోకి అనుమతిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్​లో ఉన్న అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనాల్లో నిర్మించిన షెడ్లలో సైతం భక్తులు నిండిపోయారు. పెరటాసి మాసంలో రద్దీ అధికంగా ఉంటుందని ముందుగానే భావించినా.. టీటీడీ అధికారుల అంచనాలకు మించి భక్తులు పోటెత్తుతున్నారు.

భక్తులు ఆగ్రహం

వైకుంఠం1, 2 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యాన వనంలోని షెడ్లు, క్యూలైన్లు సామాన్య భక్తులతో నిండిపోయాయి. నాలుగు కిలోమీటర్ల మేర భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనం దాదాపు ముప్పై ఐదు గంటల నుండి నలభై ఐదు గంటల వరకూ సమయం పడుతుంది. శిలాతోరణం వద్ద క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ ఎటువంటి సౌకర్యం కల్పించలేదని, కనీసం పిల్లలకు పాలు, అన్న ప్రసాదం వితరణ చేయడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెరటాసి మాసంలో శ్రీనివాసుడి దర్శనం

శ్రీ వేంకటేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన పెరటాసి మాసం(తిరుమల శనివారాలు) కావడంతో పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. పెరటాసి మాసంలో శ్రీనివాసుడి దర్శనం పొందితే చేసిన పాపాలు తొలగి, శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే పెరటాసి మాసంలో పెరిమాళ్ దర్శనార్ధం భక్తజనం సప్త గిరులకు క్యూ కడుతారు. కొవిడ్ కారణంగా గత రెండేళ్ల తరువాత తిరుమలలో జరిగిన శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలకు భారీ స్థాయిలో భక్తులు విచ్చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలోనే పెరటాసి మాసం రావడంతో బ్రహ్మోత్సవాల్లో ప్రివిలైజ్ దర్శనాలను టీటీడీ పాలక మండలి రద్దు చేసి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్య ఇస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేసింది. 

స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 35 గంటల

అయితే ఈనెల 4, 5 తేదీల్లో సాధారణంగా కొనసాగిన భక్తుల రద్దీ గురువారం ఉదయం 10 గంటల నుంచి అనూహ్యంగా పెరిగింది. దీంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణ గిరిలోని షెడ్లు భక్తులతో నిండి పోయిన శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 35 గంటల నుంచి 40 గంటల సమయం పడుతుంది.

సామాన్య భక్తుల కోసం ఏర్పాట్లు

భక్తుల రద్దీ దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు భక్తులకు అసౌఖర్యం కల్గకుండా ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా భక్తుల అనూహ్య రద్దీపై వివిధ విభాగాధిపతులతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం అన్నప్రసాదం, తాగు నీరు, పాలు వంటి సౌఖర్యాలు ఏర్పాట్లు చేశారు. మరికొద్ది రోజుల పాటు భక్తుల రద్దీ ఏడు కొండలపై కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో సామాన్య భక్తులకు అవసరం అయ్యే ఏర్పాట్లపై అధికారులు నిమగ్నం అయ్యారు. భక్తుల సంఖ్య పెరగడంతో భక్తుల రద్దీ ప్రదేశాలైన అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అతిధి గృహాలు, వసతి భవనాలు, పీఏసీ-1, 2, 3, 4, 5 వద్ద పోలీసులు భధ్రత ఏర్పాట్లు కట్టిదిట్టం చేశారు. 

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

అయితే గంటకు 4500 మంది భక్తులకి మాత్రమే దర్శన భాగ్యం కల్పించే అవకాశం టీటీడీకి ఉండడంతో భక్తులు ఓపికగా స్వామి వారి దర్శనం పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. మరో వైపు గురువారం స్వామి వారిని 72,195 మంది దర్శించుకున్నారు. అంతేకాకుండా.. 41,071 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. రూ.2.17 కోట్ల హుండీ ఆదాయం స్వామి వారి ఖాతాలో సమకూరింది.