ఈ జిమ్లకు వెళ్లాలంటే.. పైసా ఫీజు కట్టాల్సిన పని లేదు

ఓపెన్ జిమ్లలో జనం వ్యాయామం.. మరిన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్

జిమ్ కు వెళ్లాలంటే ఎక్కడైనా సరే ఫీజు కట్టాల్సిందే. కానీ కరీంనగర్ నగరంలో సర్కార్ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లకు పైసా ఫీజు లేకుండా వెళ్లొచ్చు. ఇక్కడున్న సదుపాయాలు చూస్తూ..  ప్రైవేట్  జిమ్ కు వెళ్లాల్సిన అవసరమే లేదనిపిస్తుంది. పైసా ఖర్చు పెట్టాల్సిన పని అంతకంటే లేకపోవడం.. ఎవరైనా సరే నేరుగా వచ్చి వ్యాయామం చేసి వెళ్లే సదుపాయం ఉండడం  మరింత జోష్ కలిగిస్తుంది. పర్కార్ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లకు జనం నుంచి మంచి స్పందన వస్తుండడమే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. 

ఫిట్ నెస్ కోసం.. 

బాడీ ఫిట్ నెస్ కోసం రోజూ రకరకాల వ్యాయమాలు చేస్తుంటారు చాలామంది. కొందరు 2 వేల నుంచి ఐదు వేల వరకు చెల్లించి ప్రయివేటు జిమ్ సెంటర్లకు వెళ్తుంటారు. ఇప్పుడా అవసరం లేకుండా ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. కరీంనగరంలోని పార్కులలో మూడున్నర  కోట్లతో 30 ప్రాంతాల్లో ఓపెన్  జిమ్ లు ఏర్పాటు చేశారు. మానేరు డ్యాం ప్రాంతంతోపాటు అంబేద్కర్  స్టేడియం, ఎస్ ఆర్ ఆర్  కళాశాల, కశ్మీర్ గడ్డ, హౌసింగ్ బోర్డు కాలనీ, అలకాపురి, విద్యానగర్ , జ్యోతినగర్ , మార్క్ ఫెడ్ .. ఇలా  అనేక ప్రాంతాల్లో ఓపెన్ జిమ్ లు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం, సాయంత్రం వాకింగ్  చేసే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లకు జనం నుంచి మంచి స్పందన వస్తోంది.

ఓపెన్ జిమ్ లలో  ఎయిర్  వాకర్ , పుష్  చైర్ , ఎయిర్  స్వింగ్ , షోల్డర్  వీల్ , లెగ్ ప్రెస్ , ఫుల్  చైర్ , స్టాండింగ్  ట్విస్టర్ , డబుల్  క్రాస్  వాకర్ , ఎల్లిప్టికర్  ఎక్సర్ సైజ్ , లెగ్ లిఫ్ట్ , సిట్టింగ్  ట్విస్టర్  వంటి  పరికరాలు ఉన్నాయి. వీటితో,యువతీయువకులు, సీనియర్  సిటిజన్లు, మహిళలు వ్యాయామం చేస్తున్నారు. ఇక్కడ సమయంతో సంబంధం లేకుండా.. ఫ్రీగా ఎంత సేపైనా జిమ్  చేసుకునే అవకాశం కల్పించారు. ఓపెన్ జిమ్ లతో  ఆరోగ్యం, ఆహ్లాదం కలుగుతోందని జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సరైన భద్రత లేకపోవడం, రఫ్ అండ్ టఫ్ గా వాడుతుండటంతో జిమ్ లలోని కొన్ని పరికరాలు విరిగిపోతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.  ఓపెన్ జిమ్ పరికరాలు పాడు చేయకుండా వాకర్స్ క్లబ్ లకు, స్థానికులకు బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేయాంటున్నారు. ఓపెన్ జిమ్ లకు వచ్చే వారి సంఖ్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు.