అనుమానం పెనుభూతమై .. భార్య తలపై రోకలి బండతో దాడి

అనుమానం పెనుభూతమై .. భార్య తలపై రోకలి బండతో దాడి
  • చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
  • చెట్టుకు ఉరేసుకుని భర్త ఆత్మహత్య 

మల్యాల, వెలుగు: భార్య పై అనుమానం పెంచుకున్న భర్త రోకలిబండతో ఆమె తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో కరీంనగర్ సివిల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం చనిపోగా..  భర్త చెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మల్యాల ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ నరేశ్ కుమార్, స్థానికుల వివరాల ప్రకారం..  జగిత్యాల జిల్లా  మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన సాధువుల దుర్గయ్య (50) భిక్షాటన కోసం పలు రాష్ట్రాల తిరిగి వస్తుండేవాడు. ఈ క్రమంలో భార్య రాజవ్వపై అనుమానం పెంచుకొని తరచుగా గొడవపడి కొడుతుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న రాజవ్వ తండ్రి సాయిలు పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. అయినా మార్పురాని దుర్గయ్య ఎప్పటికైనా చంపుతానని బెదిరించేవాడు.  

శుక్రవారం మధ్యాహ్నం బీడీలు చేస్తున్న సమయంలో రాజవ్వను చితకబాది రోకలితో తలపై గట్టిగా కొట్టాడు.  దీంతో రాజవ్వకు తీవ్ర రక్తస్రావం కావడంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.  వెంటనే తండ్రి సాయిలు, బంధువులు పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. భార్య చనిపోతుందనే భయంతో దుర్గయ్య గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య రాజవ్వ చికిత్స పొందుతూ మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.