సంసారం ఒక చదరంగం.. ఫ్యామిలీలో గొడవలు కామన్. ఇలాంటి మాటలు ప్రతి ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయ్. చిన్న చిన్న విషయాలకు తిట్టుకోవడం.. ఇంకాస్త కోపం వస్తే కొట్టుకుంటారు. మళ్లీ కలుస్తారు. ఇంకా వివాదం ముదిరితే విడాకులు తీసుకుంటారు. కానీ ఓ జంట మాత్రం చీటికి మాటికి తిట్టుకుంటూ కోర్టు మెట్లు ఎక్కడం అలవాటైపోయింది. వాళ్ల 41 ఏళ్ల సంసార జీవితంలో ఒకరిపై ఒకరు ఏకంగా 60 కేసులు పెట్టుకున్నారు. పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నారట. ఆ తర్వాత నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయట. దీంతో 30 ఏళ్లు కాపురం చేసి.. మనస్ఫర్థల కారణంగా విడిపోయారు. 11 ఏళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు. ఇప్పుడూ వాళ్లిద్దరూ కోర్టుకెక్కడంతో సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ మిహా కోహ్లీ, జస్టిస్ కృష్ణ మురారిల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికర కామెంట్స్ చేసింది.
వారి కేసుపై స్పందించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. మీ లాయర్ల తెలివితేటల్ని తప్పక గుర్తించాల్సిందే అంటూ కామెంట్ చేశారు. కొన్ని వివాదాలు ఓ పట్టాన పరిష్కారం కావు. ఎప్పుడైనా ఒక్కరోజు కోర్టును చూడకపోతే వారికి నిద్ర పట్టదు, ఏం చేద్దాం! వాళ్లు ఎప్పుడూ కోర్టు చుట్టూ తిరగడానికే ఇష్టపడతారని ఆయన తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసును పరిష్కరించుకోవాలని దంపతులకు సూచించారు. అలాగే మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకునేదాకా వేరే పెండింగ్ కేసులపై కోర్టుకు వెళ్లరాదని దంపతులకు ధర్మాసనం తేల్చి చెప్పింది.