ఓరుగల్లులో గుడిసె వాసులు ఆందోళనలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా వామపక్ష పార్టీలు మళ్లీ భూపోరాటాలకు దిగుతున్నాయి. వరంగల్ ట్రైసిటి పరిధిలో పలు చెరువుల శిఖం భూములు, మిగులు భూముల్లో గుడిసెలు వేసుకున్నవారు తమకు పట్టాలు ఇవ్వాలని, పక్కా ఇండ్లు కట్టించాలంటూ కొద్ది రోజులుగా జనం రోడ్డెక్కుతున్నారు. వరంగల్ లో వరసగా ఆందోళనలకు దిగుతున్నారు గుడిసె వాసులు.ఆక్రణమణ గురైన ప్రభుత్వ,చెరువు శిఖం భూములను కాపాడి తమకు గూడుకోసం కేటాయించాలంటున్నారు. చాలా ఏళ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు పేదలు. ఈమధ్య కొత్తగా కొన్ని కాలనీలు వెలిశాయి. వీటిని పోలీసుల బందో బస్తు మధ్య తొలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. దీంతో గుడిసె వాసులు ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టరేట్లను ముట్టడిసస్తున్నారు. హన్మకొండజిల్లాలోని పెద్దమ్మగడ్డ SRSP కెనాల్ ప్రాంతం భూములు, గోపాలపురం చెరువు శిఖం భూమి, ముచ్చర్ల 777 సర్వే నెంబర్ లోని భూములు, ఎల్కతుర్తిలోని చెరువుశిఖం భూమిలో 10 ఎకరాలు, న్యూశాయంపేటలోని 7 ఎకరాలల్లో సీపీఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేస్తున్నారు.
వరంగల్ పరిధిలోని తిమ్మాపురం బెస్తం చెరువు శిఖం భూములు, జక్కులొద్ది మిగులు భూములు, నిమ్మయచెరువు, కరీమాబాద్ రాజీవ్ గృహకల్ప మిగులు భూముల్లో పేదలు మూడు రోజులుగా గుడిసెలు వేసుకుంటున్నారు. 8 ఏళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తాయని ఎదురుచూసినా .. ఫలితం లేకపోవడంతో పోరాటానికి దిగుతున్నారు గుడిసె వాసులు. ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఏళ్ల కిందట ఇండ్లు కట్టుకొని...ఆన్ లైన్ లో పట్టాల కోసం అప్లయ్ చేసుకున్నవాళ్లు మూడు వేల మంది వరకు ఉంటారు.ఈ భుములను 58 జివో ప్రకారం సర్వే చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం గుడిసెలు వేసుకొని పట్టాల కోసం ఎదురుచూస్తున్నవాళ్ల సంఖ్య వేలల్లో ఉంది. వీళ్లంతా పట్టాల కోసం నిత్యం ఆందోళనలు చేస్తున్నారు.