పేదల ప్లాట్లు.. పెద్దల పాలు

  • ఇప్పటికే రూ.4 కోట్ల విలువైన ల్యాండ్​ స్వాహా
  • పట్టించుకోని పై ఆఫీసర్లు 

సూర్యాపేట, వెలుగు : జిల్లాలోని హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్ లో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు పెద్దల పాలవుతున్నట్లు తెలుస్తోంది. కొంత మంది రెవెన్యూ అధికారులతో కలిసి కొందరు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రూ.4కోట్ల విలువైన ప్లాట్లు ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద  529, 540, 541, 542 సర్వే నంబర్లలో దేవాదాయ శాఖకు సంబంధించిన 34.10ఎకరాల  భూమి ఉంది.  ఉత్తమ్ కుమార్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎన్​ఎస్పీ కెనాల్ నిర్వాసితుల కోసం అప్పటి ప్రభుత్వం రూ.6.81కోట్లతో  దేవాదాయ శాఖ భూములను కొనుగోలు చేసి రెవెన్యూ శాఖకు అప్పగించింది. వీటిలో రోడ్లు, డ్రైనేజీలకు మినహాయించి 70గజాల చొప్పున మొత్తం 1337 ప్లాట్లు చేశారు. ఇందులో 2013లో  432మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక మిగిలిన ప్లాట్లను  పంచకుండా వదిలేశారు. 


అందులోనే ఇటీవల ఎమ్మెల్యే  క్యాంప్ ఆఫీస్ కోసం 24, బంజారా భవన్ కు 60, రైతు వేదికకు 40,  పల్లె ప్రకృతి వనం కోసం 39, ఫ్రీడం ఫైటర్స్ కోసం 11, మిషన్ భగీరథ ట్యాంక్ కోసం 4 ప్లాట్లు కేటాయించారు. కాగా నిరుపేదలు కొందరు  మిగతా స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. మరికొందరు పేదల పేరుతో కొన్ని ప్లాట్లను ఆక్రమించారు. ఇదిలా ఉండగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జర్నలిస్టులకు ఇక్కడ ప్లాట్లను ఇచ్చేందుకు రిపోర్ట్ అందించాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ క్రమంలో ఈ స్థలంలోనే 121 ప్లాట్లను  జర్నలిస్టులకు ఆగమేఘాల మీద పట్టాలు అందజేశారు.  జర్నలిస్టులకు పంపిణీ చేయగా మిగిలిన ప్లాట్లను అర్హులైన పేదలకు అందించేందుకు ఆఫీసర్లు కసరత్తు ప్రారంభించారు.

 అయితే కొంతమంది రెవెన్యూ అధికారులతో పాటు బడా బాబులు కొన్ని ప్లాట్లను తమ పేరుతో పట్టాలు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై ఇటీవల పలువురు అర్హులైన పేదలు ప్రశ్నిస్తున్నారు. ఫీల్డ్ విజిట్ చేయకుండా, వైట్ రేషన్ కార్డు ఉందో లేదో వెరిఫికేషన్ లేకుండానే తహసీల్దార్ సంతకాలు చేశారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.  మరోపక్క పట్టాలు లేకుండానే వీఆర్ఏలు 19 ప్లాట్లు, ఆర్డీవో ఆఫీస్​ ఔట్​సోర్స్​ సిబ్బందిలో పది మంది పది ప్లాట్ల వరకు ఆక్రమించుకొని ఇండ్ల నిర్మాణం కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో లబ్ధిదారులకు భూములు ఇప్పిస్తామన్న పేరుతోనూ మధ్యవర్తులు వారి నుంచి లక్షల రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా పై ఆఫీసర్లు స్పందించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. 

అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చేస్తాం.. 

హుజూర్ నగర్ లోని శ్రీరామచంద్ర స్వామి గుట్ట మోడల్ కాలనీలో జర్నలిస్టులకు మాత్రమే ప్లాట్ల పట్టాలు పంపిణీ చేశాం.  వీఆర్ఏలకు కానీ, ఆర్డీఓ ఆఫీస్ స్టాఫ్ కానీ ఎలాంటి ఆదేశాలు, పట్టాలు ఇవ్వలేదు. ఎవరైనా ఆ ప్లాట్లను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే కూల్చేస్తాం. 

 జయశ్రీ, తహసీల్దార్, హుజూర్ నగర్