
హైబ్రిడ్ రకాలే ఎక్స్పోర్ట్కు అనుకూలం
హార్టికల్చర్ వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి
వర్సిటీలో టమాటా కొత్త వెరైటీలపై ఇంటర్నేషనల్ వర్క్ షాప్
హైదరాబాద్, వెలుగు: టమాటా పంటలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించాలంటే హైబ్రిడ్ రకాలే శరణ్యమని హార్టికల్చర్ వర్సిటీ వైస్ చాన్స్ లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి అన్నారు. ప్రాసెసింగ్ పరిశ్రమలకు అనుగుణంగా టమాటా హైబ్రిడ్ రకాలు రూపొందిస్తే ఎక్స్పోర్ట్ అవకాశాలు పెరిగి రైతులకు అధిక ఆదాయం లభిస్తుందన్నారు. హార్టికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో స్పీడ్ బ్రీడింగ్, బయోటెక్నాలజీ, సంకర రకాల అభివృద్ధిపై పరిశోధనలు ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లలోపే టమాటా హైబ్రిడ్ రకాలు రైతులకు అందిస్తామన్నారు.
పర్యావరణ మార్పులు, వైరస్ తెగుళ్లు, చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడి, నాణ్యతనిచ్చే నూతన టమాట రకాల రూపకల్పనపై బుధవారం హైదరాబాద్ లోని హార్టికల్చర్ వర్సిటీలో అంతర్జాతీయ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. వేసవిలో పంటను నష్టపరిచే సూది పురుగును, ఎల్లో లీఫ్ కర్లు వైరస్ తెగులును తట్టుకుని, 42 డిగ్రీలను మించి ఉష్ణోగ్రత ఉన్నా మంచి దిగుబడి ఇచ్చే టమాటా రకాలు రైతులకు అందుబాటులోకి రావాలన్నారు.
వర్క్ షాప్ లో తైవాన్ కు చెందిన సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అసఫ్ ఐబిసీజ్ మాట్లాడుతూ.. తెలంగాణలో టమాట రైతులు వైరస్ తెగుళ్లు, సూది పురుగు, ఆకుమాడు తెగుళ్లతో దిగుబడి, నాణ్యత కోల్పోతున్నారని, వాటిని తట్టుకునే రకాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆ రకాలను రైతులకు త్వరలోనే అందజేస్తామని తెలిపారు. లాభసాటిగా ఉండే టమాటా రకాలు, ఇప్పటివరకు సాధించిన పరిశోధన ఫలితాలను వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య వర్క్ షాప్ లో ప్రజెంట్ చేశారు. కార్యక్రమంలో వర్సిటీ డీన్ డాక్టర్ రాజశేఖర్, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.