- బుద్ధవనాన్ని సందర్శించిన 250 మంది రైడర్లు
హాలియా, వెలుగు : తెలంగాణ టూరిజం, హైదరాబాద్ బైక్ రైడర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన బైక్ నిర్వహణ ర్యాలీ ఆదివారం నాగార్జునసాగర్ బుద్ధవనానికి చేరుకుంది. హైదరాబాద్లో బైక్ ర్యాలీని తెలంగాణ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రులతో సహా సుమారు పది కిలో మీటర్లు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించారు. విఖ్యాంత్ కత్రి ఆధ్వర్యంలో సాగర్ లోని బుద్ధవనం చేరుకున్న బైక్ రైడర్లకు టీజీటీడీసీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అంజిరెడ్డి, ట్రాన్స్పోర్టు, వాటర్ ఫ్లూయిట్ జనరల్ మేనేజర్ ఇబ్రహీం, బుద్ధవనం డిజైన్ ఇన్చార్జి శ్యాంసుందర్రావు ఘనస్వాగతం పలికారు.
ఈ బృందం బుద్ధవనంలోని మహాస్తూపం చుట్టూ ఉన్న సర్కిళ్లను బైకులపై మూడుసార్లు పరిక్రమలు నిర్వహించిన అనంతరం బుద్ధుడి పాదాలు, బుద్ధ చరితవనం, ధ్యానవనం, స్థూప వనాలను సందర్శించి మహాస్తూపం చుట్టూ పరిక్రమలు చేశారు. అనంతరం బైక్ ర్యాలీలో పాల్గొన్న వారికి తెలంగాణ టూరిజం అధికారులు ప్రశంసాపత్రాలు అందజేశారు.