- అప్పీల్ పిటిషన్ డిస్మిస్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ బాగ్‌అంబర్‌పేటలోని వివాదాస్పద బతుకమ్మకుంట భూమి తనదేనంటూ సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 7న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను డిస్మిస్ చేసింది. సివిల్ వివాదాలపై హైకోర్టు జోక్యం చేసుకోదని, సివిల్ కోర్టుల్లోనే వాటిని పరిష్కరించాలని చెప్పింది.
ఆర్టికల్ 226 కింద హైకోర్టు జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని స్పష్టం చేసింది. అంబర్‌పేట మండలం బాగ్‌అంబర్‌పేట గ్రామంలోని సర్వే నంబర్ 563/1లోని 7 ఎకరాల భూమిని రిజిస్టర్ కాని విక్రయ ఒప్పందం ద్వారా సయ్యద్ అజాం నుంచి కొనుగోలు చేశానని సుధాకర్ రెడ్డి తెలిపారు.
ఈ భూమి విషయంలో అంబర్‌పేట తహసీల్దార్, జీహెచ్‌ఎంసీ, హైడ్రా జోక్యం చేసుకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తమ భూమిలో చెరువు లేదని, నిర్మాణాలకు యోగ్యమైన మెట్ట భూమని వివరించారు. ఎలాంటి ఆధారాల్లేకుండానే ఇది చెరువుకు చెందిన భూమి అని అధికారులు చెప్తున్నారని పిటిషనర్ కోర్టుకు వివరించాడు. దీనిపై ఈ నెల 7న సింగిల్ జడ్జి.. భూమి హక్కులకు చెందిన పత్రాలుగానీ, రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఉన్నట్లుగా చూపకుండా భూమిపై హక్కులు కోరడం చెల్లదని తీర్పు వెలువరించారు.
ఈ తీర్పును కొట్టేయాలంటూ సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. సివిల్ వివాదంలో ఆస్తిపై హక్కుల అంశాన్ని తేల్చాల్సింది సివిల్ కోర్టని, హైకోర్టు కాదని చెప్పింది. సివిల్ కోర్టులో భూ హక్కులను తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచన చేసింది.