ఇండిపెండెంట్ క్యాండిడేట్ల నామినేషన్లు రిజెక్ట్

ఇండిపెండెంట్ క్యాండిడేట్ల నామినేషన్లు రిజెక్ట్
  • ముగిసిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల స్క్రూటినీ ప్రక్రియ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ముగిసింది. నాలుగు నామినేషన్లు రాగా, రెండు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. స్వతంత్ర్య అభ్యర్థులుగా నామినేషన్ వేసిన కంటె సాయన్న, చాలిక చంద్రశేఖర్‌‌ను బలపరిచే సభ్యుడు లేకపోవడంతో వీరి నామినేషన్లను రిజెక్ట్ చేశారు. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజీపీ అభ్యర్థి గౌతమ్ రావు నామినేషన్లను అధికారులు ఫైనల్ చేశారు.

 ఈ నెల 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. వీరిలో ఎవరైనా ఒకరు నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. లేకపోతే ఈ నెల 23న పోలింగ్, 25న కౌంటింగ్ జరగనుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే పోలింగ్ జరిగే అవకాశమే కనిపిస్తుంది. కాగా, హైదరాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు మాత్రమే ఈ ఓటింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. మొత్తం ఓటర్లు 112 మంది ఉండగా, ఇందులో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం ఓటర్లలో ఎంఐఎంకి 49 మంది, కాంగ్రెస్‌కి 14, బీఆర్ఎస్‌కి 24, బీజేపీకి 25 మంది ఉన్నారు.