ఎమ్మెల్సీ బరిలో ఎంఐఎం, బీజేపీ

ఎమ్మెల్సీ బరిలో ఎంఐఎం, బీజేపీ
  • నామినేషన్ల విత్ డ్రా గడువు ముగియడంతో అభ్యర్థుల ఖరారు
  • ఈ నెల 23న పోలింగ్, 25న కౌంటింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనివార్యం అయింది. నామినేషన్ల విత్ డ్రా గడువు బుధవారంలో ముగిసింది. ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం నాలుగు నామినేషన్లు రాగా ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులకు బలపరిచే సభ్యులు లేకపోవడంతో వారిద్దరి నామినేషన్లను రెండు రోజుల కింద స్క్రూట్నీలో అధికారులు తిరస్కరించారు. ఇప్పుడు నామినేషన్ల విత్ డ్రా సమయం అయిపోవడంతో బీజీపీ అభ్యర్థి గౌతమ్ రావు, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ నెల 23న పోలింగ్, 25న కౌంటింగ్ జరగనుంది. అయితే ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం అభ్యర్థికి కాంగ్రెస్ సపోర్టు చేసే అవకాశముంది. అయితే బీజేపీ కూడా పోటీలో ఉండటంతో పాటు పార్టీలకు అతీతంగా తనకు అవకాశం కల్పించాలని ఆ పార్టీ అభ్యర్థి ఇతర పార్టీల ఓటర్లను కోరుతున్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పోటీలో లేదు. మరి ఆ పార్టీ ఎన్నికలకి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటారా? లేక దూరంగా ఉంటారా? అన్నదానిపై కూడా స్పష్టతలేదు. 

112 మంది ఓటర్లు

హైదరాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రమే ఈ ఓటింగ్ లో పాల్గొనేందుకు అవకాశముంది. మొత్తం ఓటర్లు 112 మంది ఉండగా, ఇందులో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్అఫీషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం ఓటర్లలో ఎంఐఎంకు 49 మంది, కాంగ్రెస్​కు 14, బీఆర్ఎస్​కు 24, బీజేపీకి 25 మంది ఉన్నారు.