
అర్ధరాత్రి 12 గంటలు దాటింది. ఉస్మానియా దవాఖాన నుంచి నయాపూల్మీదుగా పాతబస్తీలోకి అడుగుపెట్టామో లేదో అత్తరు వాసనల గుభాలింపు ఆహా అనిపించింది. ఆ సువాసనల మధ్య ట్రాఫిక్చిక్కులు చేధించుకుంటూ ముందుకెళ్తుండగా ఆఫర్.. ఆఫర్.. రంజాన్ఆఫర్అంటూ షాపుల ముందు కుర్రాళ్ల అరుపులు వాహనాల రణగొణధ్వనులను ఛేదించుకుంటూ వచ్చి చెవులను తాకాయి. అలాగే వెళ్తూ మదీనా చౌరస్తా దాటి తలపై కెత్తి చూస్తే దూరంగా...నగరానికి మణిమకుటమై 435 ఏండ్లుగా విరాజిల్లుతున్న చారిత్రక కట్టడం చార్మినార్ఠీవీగా కనిపించింది.
ఆ దారిలో నైట్ బజార్కళ ఉట్టిపడింది. ఇంకాస్త ముందుకు వెళ్లి చార్మినార్వెళ్లే పాదచారుల వీధిలోకి ప్రవేశించగానే నచ్చిన వస్తువులు కొంటూ.. ముందుకు సాగుతున్న భారీ జనప్రవాహం దర్శనమిచ్చింది. కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఏర్పాటు చేసిన విద్యుత్కాంతుల మధ్య ధగధగలాడుతున్న ఆ ప్రాంతం.. అసలది అర్ధరాత్రా లేక సాయంత్రమా అన్న భ్రాంతిని కలిగించింది. ‘ఆవో భయ్యా యే షేర్వానీ దేఖో అంటూ కొందరు.. బహెన్యే కుర్తా దేఖో సస్తే మే దే రహా హు..బుర్కా లేలో దీదీ ’ అంటూ మరికొందరి పిలుపులు వినిపిస్తూనే ఉన్నాయి.
కుర్తా, పైజామాలే కాదు.. లాడ్‌బజార్‌లో అతివలకు అందాన్ని తెచ్చే సుందరమైన గాజులు, చార్మినార్చుట్టూ వీధి వ్యాపారుల దగ్గర దొరికే నగలు, కమ్మలు, హ్యాండ్‌బ్యాగ్స్, మేకప్సామగ్రి, చెప్పులు, పిల్లలకు బొమ్మలు, దుస్తులు ఇలా అన్ని వర్గాల వారికి కావాల్సిన ప్రతి వస్తువూ మనలను కొనమని పిలుస్తూనే ఉంటుంది. అక్కడే ఉన్న చార్మినార్ పోలీస్ స్టేషన్నుంచి ‘యే కబర్చార్మినార్పోలీస్స్టేషన్సే కియా జా రహీ హై’ అంటూ ప్రతి ఐదు నిమిషాలకోసారి తప్పిపోయిన వారి పేర్లను అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. అలా తెల్లవారుజాము వరకు నైట్ బజార్ కొనసాగుతూనే ఉంది. మరో రెండు రోజుల్లో ఈద్ ఉల్ ఫితర్ వస్తుండడంతో చివరి శుక్రవారం రాత్ బజార్ అద్భుతంగా దర్శనమిచ్చింది. – హైదరాబాద్ సిటీ, వెలుగు