
- వెళ్లి చూస్తే వ్యవసాయం చేస్తున్నరు
- హైడ్రా ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు
- ప్రైవేట్లే అవుట్లలో పార్కులు, రోడ్లు కబ్జా చేశారని కంప్లయింట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 49 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ రంగనాథ్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఎక్కువగా శివార్లలోని లే ఔట్లకు సంబంధించినవే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదుర్‌గుల్ లో 1980 లో 2,684 ప్లాట్లతో చాణక్యపురి లేఔట్ వేశామని, 2024 వచ్చేసరికి ఇందులోని 30 ఎకరాల పార్కులు, రోడ్లు కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్58, 59లో ఉన్న ఎన్ఎంఆర్- దివ్యానగర్ లే ఔట్‌లో ప్లాట్లు కొన్నామని, ఇప్పుడవి కనిపించడంలేదని పలువురు యజమానులు ఫిర్యాదు చేశారు. ఇలా 66 ప్లాట్లు గల్లంతయ్యాయని, ఇప్పుడక్కడ వ్యవసాయం చేస్తున్నారని వాపోయారు. ఇందులో పార్కులు, రోడ్లు కూడా ఉన్నాయని, లే ఔట్‌ను కాపాడాలని కోరారు.
గచ్చిబౌలి గోపన్నపల్లిలోని టీఎన్‌జీఓ కాలనీలో ఉద్యోగులకు కేటాయించిన భూములను కొంతమంది టీఎన్‌జీఓ ప్రతినిధులమని 8 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని, టీఎన్‌జీఓ కాలనీ సంక్షేమ సంఘం(గచ్చిబౌలి) ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా చెంగిచర్లలోని సర్వే నంబరు 7, 10లో వేసిన శ్రీపురం కాలనీలో పార్కులు, రోడ్లు కబ్జాకు గురయ్యాయని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల సమక్షంలో గూగుల్ మ్యాప్‌లు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులను పరిశీలించి సమగ్ర విచారణకు కమిషనర్ ఆదేశించారు.
జీహెచ్ఎంసీ ప్రజావాణికి 107
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 107 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి 62, ట్యాక్స్ విభాగానికి 11, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాలకు ఏడు చొప్పున, ఫైనాన్స్ విభాగానికి నాలుగు దరఖాస్తులు వచ్చాయి. ఫోన్ ఇన్ ద్వారా ఏడు కంప్లయింట్స్ అందాయి. అలాగే ఆరు జోన్లలో 86 ఫిర్యాదులు రాగా, కూకట్ పల్లి లో 32, సికింద్రాబాద్ లో 12, శేరిలింగంపల్లిలో 19, చార్మినార్ లో 9, ఎల్బీనగర్ లో 13, ఖైరతాబాద్ లో ఒక ఫిర్యాదు వచ్చాయి.
హెడ్డాఫీసులో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డితో కలిసి కమిషనర్ ఇలంబరితి ఫిర్యాదులు స్వీకరించారు.హైదరాబాద్ లో 119.. రంగారెడ్డిలో 57హైదరాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అనుదీప్ దరఖాస్తులను స్వీకరించారు. 119 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అలాగే కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్నిర్వహించిన ప్రజావాణికి 57 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ సి.నారాయణరెడ్డి అర్జీలు స్వీకరించారు. మేడ్చల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 100 ఫిర్యాదులు అందాయి. అడిషనల్కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీఆర్ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు.