హైదరాబాద్ స్టేట్‌లో మహిళా సంఘసంస్కర్తలు వీరే

హైదరాబాద్ స్టేట్‌లో మహిళా సంఘసంస్కర్తలు వీరే

ఆంధ్ర సోదరి సమాజం

హైదరాబాద్​ రాజ్యంలో మహిళల పరిస్థితి అధ్వానంగా ఉండేది.  మొదటి సాలార్​జంగ్​ కాలం కంటే ముందు స్త్రీల పరిస్థితి నాలుగు గోడలకే పరిమితం. ఆ తర్వాత బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలను స్థాపించడంతో కొంతమందికి చదువు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా 20వ శతాబ్దంలో స్త్రీల పరిస్థితి మెరుగైంది. జ్ఙానకుమారి హెడా, టంగుటూరి వరలక్ష్మి, మార్గరెట్​ ఇకజిమ్స్​​, ప్రిన్సెస్​ దుర్రాషెవర్​, నీలోఫర్, థెహ్మీనాభాయి ధాగే, మసుమా బేగం, సంగెం లక్ష్మీబాయమ్మ తదితరులు సామాజిక, రాజకీయ రంగాల్లో కీలక పాత్ర పోషించారు. పలు సంఘాలను స్థాపించి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. 

జ్ఙానకుమారి హెడా

స్వాతంత్ర్యోద్యమ కాలంలో హైదరాబాద్​ నగరంలో సత్యాగ్రహం చేసిన మొదటి మహిళగా జ్ఙానకుమారి హెడా గుర్తింపు పొందారు. ఈమె బ్రిటీష్​ ఇండియా, హైదరాబాద్​ సంస్థానంలో ఏకైక మహిళా సత్యాగ్రహి. జ్ఞానకుమారి హెడా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు హరీష్​ చంద్ర హెడాను వివాహమాడి హైదరాబాద్​లో స్థిరపడ్డారు. పద్మజానాయుడు స్థాపించిన స్వదేశీ లీగ్​లో సభ్యురాలు. గాంధీ స్థాపించిన హరిజన సేవక్​ సమాజ్​లో కీలక పాత్ర పోషించారు. జోగినీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. 

టంగుటూరి వరలక్ష్మి

ఈమె స్త్రీ వైద్య నిపుణురాలు. స్త్రీల ఆరోగ్య పరిషత్తును స్థాపించి సేవలందించారు. దేవరకొండలో జరిగిన రెండో ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించారు. పరదా పద్ధతిని నిషేధించాలని, కళావంతు(జోగినీ)ల్లో వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. 

మార్గరెట్​ ఇకజిమ్స్​​

1922లో మార్గరెట్​ ఇకజిమ్స్​ ప్రోత్సాహంతో ది ఉమెన్స్​అసోసియేషన్​ ఫర్​ ఎడ్యుకేషనల్​ అండ్​ అడ్వాన్స్​మెంట్​ అనే సంస్థ ఏర్పాటైంది. 300 మంది సభ్యులతో హైదరాబాద్​ స్త్రీల సభ ఏర్పాటైంది. ఇది 10 సభలను నిర్వహించింది. 

థెహ్మీనాభాయి ధాగే

ధాగే 1950లో హైదరాబాద్​ చిల్డ్రన్​ సొసైటీని స్థాపించారు. 1955లో సొంత నిధులతో రాధాకిషన్​ హోం అనే అనాథాశ్రమం స్థాపించారు. అనంతరం రాధాకృష్ణ గర్ల్స్​ హోంను అనాథ బాలికల కోసం స్థాపించారు. 1990లో ధాగే మరణించే వరకు ఆ సంస్థలను చూసుకున్నారు. 

మసుమా బేగం

మసుమా బేగం 1901, అక్టోబర్ 7న బిల్​గ్రామి, ఖాదిల్​ జంగ్​ దంపతులకు హైదరాబాద్​లో జన్మించారు. తల్లి వ్యక్తిత్వం ఆమె జీవితంపై ప్రగాఢమైన ముద్రవేసింది. 1927లో ఆలిండియా ఉమెన్స్​ కాన్ఫరెన్స్​ను స్థాపించారు. శ్రీలంక, ఇండోనేషియా, జెనీవాలకు భారత బృందం తరఫున మసుమా బేగం నాయకురాలిగా వెళ్లి సందర్శించారు. 1934 నుంచి దాదాపు దశాబ్దంపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ సెనేట్​ సభ్యురాలిగా, ఆర్థిక సంఘం సభ్యురాలిగా సేవలందించారు. 1952లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈమెకు లేడి బెడెన్​పాల్​ పతకం ప్రదానం చేశారు. భారతదేశంలో మంత్రి పదవి చేపట్టిన మొదటి ముస్లిం మహిళగా మసుమాబేగం గుర్తింపు పొందారు. 

సంగెం లక్ష్మీబాయమ్మ

1911లో దొంతుల రామయ్య, సీతమ్మ అనే దంపతులకు రంగారెడ్డి జిల్లా ఘట్​కేసర్​లో జన్మించారు. తెలంగాణ గ్రామీణ సమాజంలో జన్మించి, జాతీయోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన ఏకైక వనిత.  ఆ తర్వాత సంగెం లక్ష్మీబాయమ్మ తన మేనమామ సీతారామయ్య ఇంట్లో ఉండి ఉన్నవ దంపతులు స్థాపించిన శారదాసదన్​లో చదువుకున్నారు. మద్రాస్​ ఆర్ట్ స్కూల్​లో డిప్లొమా, బీఏ ఉత్తీర్ణత పొందిన తెలంగాణ తొలితరం పట్టభద్రుల్లో ఈమె ఒకరు. లక్ష్మీబాయమ్మ 1928లో సైమన్​ కమిషన్​ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 1930–32లో ఉప్పు సత్యాగ్రహంలో దుర్గాభాయి దేశ్​ముఖ్​తోపాటు 1933 వరకు రాయవెల్లూర్​ జైలులో శిక్ష అనుభవించారు. 

ఈమె జైలులో రచించిన గ్రంథం నా జైలు జ్ఞాపకాలు – అనుభవాలు. 1952 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి గెలుపొంది బూర్గుల ప్రభుత్వంలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్​ అవతరణ తర్వాత మెదక్​ నుంచి లోక్​సభకు ఎన్నికయ్యారు. తిరుమల రామచంద్ర రచించిన హంపి నుంచి హరప్పా వరకు అనే ఆత్మకథలో లక్మీబాయమ్మ మద్రాస్​ జీవితం, ఆమె మానవతా మూర్తివత్వ విశేషాలు ఉన్నాయి. ఈమె బూర్గుల రామకృష్ణారావు కుమార్తె ఇందిరతో కలిసి హైదరాబాద్​లోని సంతోష్​నగర్ లో ఇందిరా సేవా సదన్​ అనే అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు.

ప్రిన్సెస్​ దుర్రాషెవర్​

ప్రిన్సెస్​ దుర్రాషెవర్​ ఆటోమన్ సామ్రాజ్యానికి చెందిన చివరి వారసుడు రెండో అబ్దుల్ మజీద్​ కుమార్తె. ఇతను చివరి ఖలీఫా. దుర్రాషెవర్​ ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ పెద్ద కుమారుడు అజంజాను వివాహం చేసుకున్నారు. దీంతో ఈమె బీరార్​ రాణి అయ్యారు. 1904లో హైదరాబాద్​లోని బేగంపేట ఎయిర్​పోర్టు భవనానికి శంకుస్థాపన చేశారు. దుర్రషెవర్​ చిల్డ్రన్​ అండ్​ జనరల్​ హాస్పిటల్​ను స్థాపించారు. బాలికల పాఠశాలను కూడా స్థాపించారు. అలీఘర్​ ముస్లిం యూనివర్సిటీలో అజ్మిల్​ఖాన్​ తబియా కళాశాల హాస్పిటల్​ను ప్రారంభించారు. 2004లో నిజాం సిల్వర్​ జూబ్లీ మ్యూజియాన్ని స్థాపించారు. 

నీలోఫర్​ 

నీలోఫర్ అసలు పేరు పర్హత్​ బేగం సాహిబా. ఈమె ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ రెండో కోడలు. అతని రెండో కుమారుడు ముఅజ్జంజా బహదూర్​ను వివాహం చేసుకున్నారు. ఈమె ఆటోమన్ సామ్రాజ్యం చివరి యువరాణి. వీరి వివాహం 1931, నవంబర్​ 12న నీస్​లో జరిగింది. నీలోఫర్​ సేవకురాళ్లలో ఒకరు ప్రసవ సమయంలో మరణించడంతో చలించిపోయి మామ ఏడో నిజాంను సంప్రదించి రెడ్​హిల్స్​ ప్రాంతంలో నీలోఫర్ హాస్పిటల్​ను కట్టించారు. చిల్డ్రన్​ హాస్పిటల్​, స్కూల్​ను స్థాపించారు.

సంఘాలు 

భారత మహిళా సమాజం

భారత మహిళా సమాజాన్ని 1907లో సీతాబాయి స్థాపించారు. ఇది హైదరాబాద్​లో మొదటి మహిళా సంఘం. ఈ సంఘాన్ని రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ ఇంట్లో స్థాపించారు. 1922లో మార్గరెట్​ ఇకజిమ్స్​ ప్రోత్సాహంతో ది ఉమెన్స్​ అసోసియేషన్ ఫర్​ మెడికల్​ అండ్​ సోషల్​ అడ్వాన్స్​మెంట్​ అనే సంస్థ ఏర్పడింది. ఇది అఖిల భారత మహిళా సమాఖ్యకు అనుబంధంగా పనిచేసింది. 1925లో హైదరాబాద్​లో ఆంధ్రసోదరి సమాజాన్ని స్థాపించారు నడింపల్లి సుందరమ్మ, పండిత వీరరాఘవమ్మ, లోకానంది జానకమ్మ, పురం రుక్మిణమ్మ. ఆంధ్ర సోదరి సమాజం నుంచి వెలువడిన పత్రిక సావిత్రి. యామిని పూర్ణతిలకం యువతి శరణాలయం(1922) అనే సంస్థను స్థాపించారు. ఈ యువతి శరణాలయం ముఖ్యంగా సమాజ పీడితులు, సెక్స్​ వర్కర్లకు ఆశ్రయం ఇచ్చి వారి అభివృద్ధికి దోహదం చేసింది. 1930లో దుర్గాబాయి దేశ్​ముఖ్​ మొదలైనవారు ఆంధ్ర మహిళా సంఘం స్థాపించారు. 1938లో సుమిత్రాదేవి ఆర్యయువజన పాఠశాలను చిక్కడపల్లిలో స్థాపించారు. 

ఆంధ్రయువతి మండలి

1935లో హైదరాబాద్​లో లక్ష్మీనర్సమ్మ, ఎల్లాప్రగడ సీతాకుమారి, ఇల్లందుల సరస్వతి దేవి, సంగం లక్ష్మీబాయి తదితర ప్రసిద్ధ మహిళలు ఆంధ్ర యువతి మండలిని స్థాపించారు. ఆంధ్ర యువతి మండలి హైదరాబాద్​లో ఒక శిశు విహార్​ను స్థాపించారు. ఆంధ్ర యువతి మండలి సాంస్కృతిక కార్యక్రమాలను, జాతీయ పండుగలను నిర్వహించారు. ఆంధ్ర యువతి మండలి మహిళలకు విద్య, వైద్యం, వయోజన విద్య కోసం కృషి చేశారు. వృత్తి నైపుణ్యం గల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. 
 
మహిళా వసతి గృహం 

1931లో అఖిలభారత మహిళా సభ మహిళల కోసం వసతి గృహాన్ని ప్రారంభించారు. మహిళా లోకం అనే మ్యాగజీన్​ను ఎల్లాప్రగడ సీతాకుమారి, ఇల్లందుల సరస్వతి దేవి స్థాపించారు.

ముస్లిం సంఘాలు

అంజుమన్​ ఇ కవాతిక్​ దక్కన్​
అంజుమన్​ ఇ సిరజుల్​ కవాతిక్​
లేడి బర్డన్స్​ క్లబ్​
అంజుమన్​ ఇ ఇస్లాం
లేడి హైదరీ క్లబ్