పొలిటికల్ డొనేషన్ల పేరిట..ఐటీకి ఎగనామం!

పొలిటికల్ డొనేషన్ల పేరిట..ఐటీకి ఎగనామం!
  • రూ.110 కోట్లు ఇన్​కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన టెకీలు
  • ఒకే మెయిల్​ ఐడీతో చాలా మంది ఉద్యోగుల రిటర్నులు  
  • పరిశీలనలో గుర్తించిన అధికారులు 
  • 2021 నుంచీ రిటర్నులు చెక్ చేసే యోచన 
  • రిటర్నుల అప్డేట్​కు మార్చి 31 వరకూ గడువు 
  • లేదంటే 200 శాతం వరకు ఫైన్ విధించేందుకు సిద్ధం 

హైదరాబాద్, వెలుగు: ఇన్​కమ్ ట్యాక్స్​లో మినహాయింపులను పొందేందుకు చాలా మంది ఉద్యోగులు ఇంటి కిరాయి కడుతున్నామనో, పిల్లల స్కూలు ఫీజులకు ఖర్చయిపోతున్నదనో.. ఇన్సూరెన్స్, హౌస్ లోన్స్​ ఉన్నాయనో చెప్పి క్లెయిమ్​ చేసుకుంటుంటారు. కానీ, కొందరు టెకీలు మాత్రం పొలిటికల్ పార్టీలకు డొనేషన్లు ఇచ్చామని చెప్పి భారీగా ఐటీ మినహాయింపులు పొందారు. అయితే, గుర్తింపు లేని అనామక పార్టీల నాయకులతో కమీషన్లు మాట్లాడుకుని.. వారికి డొనేషన్లు ఇచ్చి, తిరిగి తమ డబ్బును వాపస్ తీసుకున్నట్టు విచారణలో ఐటీ అధికారులు గుర్తించడంతో బండారం బయటపడింది.

ఇలా 36 కంపెనీలకు చెందిన అనేక మంది టెకీలు ఏకంగా రూ.110 కోట్ల మేరకు ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు ఐటీ రిటర్నుల పరిశీలనలో అధికారులు గుర్తించారు. ఆదాయపన్ను చట్టంలోని 80 జీసీసీ సెక్షన్​ను అడ్డం పెట్టుకుని వాళ్లు ఇలా దొంగ రిటర్నులు ఫైల్ చేశారని తేల్చారు.

పార్టీలే కమీషన్లు తీసుకొని..

గుర్తింపు లేని పార్టీలకు డొనేషన్లు ఇచ్చినట్టు ఆ టెకీలు ఐటీ రిటర్నులలో పేర్కొన్నట్టు ఐటీ అధికారుల ఇన్వెస్టిగేషన్​లో తేలింది. ఏడాదికి రూ. 46 లక్షల జీతం ఉన్న ఓ ఐటీ ఉద్యోగి.. గుర్తింపులేని ఓ అనామక పార్టీకి రూ. 45 లక్షలు డొనేట్ చేసినట్టుగా రిటర్నులు సమర్పించాడని తెలిసింది. ఆ అనామక పార్టీ చెక్ రూపంలోనో లేదంటే బ్యాంక్ ట్రాన్స్​ఫర్స్ ద్వారానో డొనేషన్లను తీసుకుని.. అందులో కొంత కమీషన్ కట్​చేసుకుని సదరు ఐటీ ఉద్యోగులకు మళ్లీ ఆ అమౌంట్ తిప్పి పంపుతున్నట్టుగా విచారణలో తేటతెల్లమైంది. చాలా రిటర్నులలో ఒకే ఈమెయిల్ ఐడీని వాడినట్టు అధికారులు గుర్తించడంతోనే ఈ దందా బయటపడిందని, లేకపోతే ఇంకెన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా నడిచేదోనని చెప్తున్నారు. ప్రధానంగా గుజరాత్, తెలంగాణ నుంచే ఇలాంటి ఐటీ మోసాలు ఎక్కువగా జరిగినట్టు గుర్తించారు. 

 2021 నుంచి తవ్వుతరట.. 

టెకీల ఐటీ రిటర్నుల మోసం బయటపడటంతో మునుపటి ఆర్థిక సంవత్సరాల రిటర్నులపైనా మరోసారి స్క్రూటినీ చేయాలని ఆదాయపన్ను శాఖ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. 2021–22 నుంచి 2023–24 వరకు ఫైల్ చేసిన ఐటీ రిటర్నులను పరిశీలించనున్నారు. ఏవైనా తేడాలున్నా.. తప్పులున్నా ఆ రిటర్నులను వాపస్ తీసుకోవాల్సిందిగా ట్యాక్స్ పేయర్లకు చెప్పనున్నారు. ఒకవేళ తప్పుడు క్లెయిములు చేసినట్టు తేలితే.. మరోసారి కొత్తగా ఆ ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ అప్​డేట్ చేయాలని ఆదేశించనున్నట్టు సమాచారం.

ఇందుకోసం మార్చి 31 వరకు గడువు విధించనున్నట్టు తెలిసింది. గడువులోపు అప్​డేటెడ్ ఐటీఆర్ ఫైల్​ చేయకుంటే 200 శాతం ఫైన్ వేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి చాలా కంపెనీలు ఇప్పుడు సెక్షన్ 80 జీసీసీ కింద క్లెయిములను తీసుకోవడం లేదని అధికారులు అంటున్నారు. 

ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్​ (టీడీఎస్) ద్వారానే ట్యాక్స్ రిబేట్లను ఇస్తున్నారని చెబుతున్నారు. కానీ, ఉద్యోగులు బయటి నుంచి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్​లోని ఓ ప్రముఖ కంపెనీలో పని చేసే 430 మంది టెకీలు.. దాదాపు రూ.17.8 కోట్ల వరకు ఐటీ శాఖకు ఎగనామం పెట్టారని తేలింది. ఒక్కొక్కరు సగటున రూ. 4.2 లక్షల వరకు ఇలా లబ్ధి పొందారని వెల్లడైంది. అయితే, ఈ విషయంలో కంపెనీకి సంబంధం లేకుండా ఉద్యోగులు ప్రైవేటుగా ఐటీఆర్ ఫైల్ చేశారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.