ఇవాళ్టి (14) నుంచి క్వాంటం చార్టర్‌ను ప్రకటించనున్న సర్కార్

ఇవాళ్టి (14) నుంచి క్వాంటం చార్టర్‌ను ప్రకటించనున్న సర్కార్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ను క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. నీతి ఆయోగ్‌కు చెందిన నీతి ఫ్రాంటియర్ టెక్ హబ్ (ఎఫ్‌టీహెచ్) సహకారంతో 2025ని ఐక్యరాష్ట్ర సమితి క్వాంటం ఇయర్‌గా జరుపుకుంటున్నది. ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటం డే సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం క్వాంటం ఫ్రాంటియర్ టెక్ చార్టర్‌ను ప్రకటించనుంది. ఈ చార్టర్.. క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్, సెక్యూరిటీలలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, ఆర్థిక రంగం, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాల్లో సవాళ్లను అధిగమించే లక్ష్యాలతో పనిచేయనుంది.

ఇందులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఐఐఐటీ హైదరాబాద్, క్వాంటం ఎకోసిస్టమ్స్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూఈటీసీఐ) వంటి స్థానిక సంస్థలు, పరిశ్రమలు భాగస్వామ్యం కానున్నాయి. ఈ ఏడాది క్వాంటం కంప్యూటింగ్ గ్లోబల్ సమిట్‌ను నిర్వహించి.. పరిశోధకులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమల యాజమాన్యాలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ చొరవ 2047 నాటికి వికసిత భారత్ దిశగా అడుగులు వేయడంలో కీలక పాత్ర పోషించనుంది.