
హనుమకొండ, వెలుగు: మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ముస్తాబవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 144 దేశాల నుంచి 120 మందికిపైగా సుందరీమణులు ఈ మెగా ఈవెంట్ కు హాజరుకానుండగా, వారితో పాటు వివిధ దేశాలకు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్లు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రతినిధులు, కళాకారులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ మేరకు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడంతోపాటు పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో రకరకాల ఈవెంట్లకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మే 14న 'కాకతీయ హెరిటేజ్ టూర్' పేరుతో ఓరుగల్లుకు ప్రపంచ అందగత్తెలను తీసుకురానున్నారు.
14న కాళోజీ కళాక్షేత్రం, రామప్ప విజిట్..
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెలను ఐదు టీములుగా విభజించి, తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు టూర్లు నిర్వహించనున్నారు. అందులో భాగంగానే మే 14న 30 మందితో కూడిన ప్రపంచ సుందరీమణుల టీమ్ చారిత్రక నేపథ్యంలో ఉన్న వరంగల్ లో పర్యటించనుంది. 14న ఉదయం 11.30 గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ కు చేరుకోనున్న టీమ్, అక్కడి నుంచి బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించనుంది. అక్కడ వారికి బతుకమ్మలతో స్వాగతం పలికిన అనంతరం విద్యార్థులతో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత తిరిగి హరిత కాకతీయకు చేరుకుని, లంచ్ అనంతరం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ విజిట్ కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ తిరుగు ప్రయాణం
కానున్నారు.
కోట'కు దక్కని అవకాశం
మిస్ వరల్డ్ పోటీదారుల కాకతీయ టూర్ లో టూరిజం డిపార్ట్మెంట్ తెలంగాణ రాజముద్రలో స్థానం పొందిన కాకతీయు కళాతోరణాలు ఉన్న వరంగల్ కోట, ఖుష్ మహాల్, వేయి స్థంభాల గుడి, ఓరుగల్లు ఇందకీలాద్రిగా పేరుగాంచిన భద్రకాళి ఆలయం, పద్మాక్ష్మీ టెంపుల్, అగ్గలయ్య గుట్ట, భద్రకాళి బండ్, కాకతీయుల మెట్ల బావులు, ఇతర విశేషాలెన్నో ఉన్నా కాకతీయ టూర్లో ఛాన్స్ ఇవ్వలేదు. కానీ, కాకతీయ టూర్ లో కాళోజీ కళాక్షేత్రం, రామప్పకు అవకాశం కల్పించిన టూరిజం ఆఫీసర్లు ఎన్నో చారిత్రక ప్రదేశాలకు నిలయంగా ఉన్న ఓరుగల్లును చుట్టేలా మిస్ వరల్డ్ ప్రతినిధులు టూర్ డిజైన్ చేయాలని చరిత్రకారులు, పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు.