
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పనుంది. ఛార్జీలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేసింది ఎ అండ్ టీ సంస్థ. హైదరాబాద్ లో ఉన్న మూడు కారిడార్లలో టికెట్ రేట్లు పెంచే కసరత్తు మొదలుపెట్టారు అధికారులు.
మెట్రో 2017 లో ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు సంస్థ నష్టాలలోనే ఉందని, అందుకే లాస్ ను తగ్గించుకునేందుకు ఛార్జీలు పెంచాలని భావిస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం మెట్రో నష్టాలు 6 వేల 5 వందల రూపాయలు దాటిన పరిస్థితుల్లో పెంపు తప్పదనే నిర్ణయానికి వచ్చారు. మెట్రో ప్రాజెక్ట్ ను నాన్ పర్ఫార్మింగ్ అస్సెట్ గా మిగిలి పోకుండా ఉంచేందుకు ఛార్జీల పెంపు తప్పదని అంటున్నారు.
పెరుగుతున్న ఖర్చులు.. చాలీ చాలని రెవెన్యూ:
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఛార్జీలు కనిష్టంగా 2 కిలోమీటర్లకు 10 రూపాయల నుంచి గరిష్టంగా 26 కిలోమీటర్ల మేర 60 రూపాయలుగా ఉన్నాయి. ఇప్పుడు పెంచనున్న ఛార్జీలతో దాదాపు 5 లక్షల ప్రయాణికులపై భారం పడనుంది.
‘‘ఛార్జీలపై ఆధారపడకుండా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ.. ఆశించినంత ఆదాయం రావటం లేదు. పెరుగుతున్న ఇన్ పుట్ కాస్ట్ ను తగ్గించేందుకు ఛార్జీల పెంపు తప్పనిసరి. కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ఇంప్రూవ్ చేసేందుకు కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదు’’ అని సంస్థ ప్రకటించింది.
ఢిల్లీ, బెంగళూర్ లో ఛార్జీలు ఎలా ఉన్నాయి:
బెంగళూర్ లో ఇటీవలే ఛార్జీలు పెంచారు. 25 కి.మీ. దాటితే గరిష్టంగా 90 రూపాయల వరకు ఛార్జీలు పెంచారు. ఢిల్లీలో మెట్రో ఛార్జీలను 2017లో పెంచారు. తాజాగా బెంగళూర్ లో 44 శాతం పెంచారు. దీంతో హైదరాబాద్ మెట్రో కూడా ఛార్జీలు భారీగానే పెంచనున్నట్లు తెలుస్తోంది. కనీసం 30 శాతం పైనే ఈ సారి ఛార్జీలు పెంచనున్నట్లు సమాచారం.