- మూసీలో కూల్చివేతలు హైడ్రా చేపట్టట్లే
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసీ పనుల్లో హైడ్రా లేదని, మూసీ నదికి ఇరువైపులా సర్వేలకు హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూసీ నివాసితులను హైడ్రా తరలించడంలేదని, అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టడంలేదన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇండ్లపై హైడ్రా మార్కింగ్ చేయడంలేదన్నారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టని.. దానిని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతున్నదని చెప్పారు. చెరువుల పునరుద్ధరణ హైడ్రా లక్ష్యమన్నారు.
పేదలు, మధ్య తరగతి ప్రజల ఇండ్లను హైడ్రా కూల్చివేయదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు. హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకేనన్నారు. అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేసిందంటూ కొందరు కావాలనే సోషల్‌మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. హైడ్రా పేదల నివాసాల జోలికి వెళ్లదని, అలాగే నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చదని స్పష్టం చేశారు. ఈ విషయాలు ప్రజలు, సామాజిక మాధ్యమాలు గుర్తించాలన్నారు. ప్రకృతి వనరుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడడం, వర్షాలు, వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు, వరద నీరు సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకోవడం, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించడమే హైడ్రా లక్ష్యమన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరిస్తూ డీఆర్ ఎఫ్ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్)ను రంగంలోకి దించి ప్రజలను కాపాడుతున్నామన్నారు.
నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులపై చర్యలకు హైడ్రా కసరత్తు చేస్తుందన్నారు. ట్రాఫిక్ ఉన్నతాధికారులతో సమీక్షించి కారణాలపై స్టడీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల గుర్తింపు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించామన్నారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిటీలో చెరువులను పునరుద్ధరించడం, వరద నీరు ఆయా చెరువుల్లోకి ఎక్కడికక్కడ చేరేలా చూడడం, వరదనీటి కాలువలు, నాలాలు ఆక్రమణలు లేకుండా నీరు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవడంతోపాటు స్టడీ చేయించి చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణ చేస్తున్నామన్నారు.