![ఒకే రోజు ఐదు ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు](https://static.v6velugu.com/uploads/2025/02/hydra-officials-swiftly-respond-to-complaints-remove-encroachments-and-acquire-land_GH5qhMaV43.jpg)
- మల్కాజిగిరి డిఫెన్స్‌కాలనీలో 1,200 గజాల స్థలం స్వాధీనం
- ‘హైడ్రా ప్రజావాణి’ ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తున్న అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు:హైడ్రా ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు సత్వరమే స్పందిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో బుధవారం సిటీలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించారు. కాప్రాలోని ఎన్ఆర్ఐ కాలనీవాసులు రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ప్రహరీని కూల్చివేశారు. దీంతో సీనియర్ సిటిజన్ కాలనీ, శాంతి విల్లాస్, లక్ష్మి విల్లాస్, గౌరీనాథ్ పురం, వంపుగూడ కాలనీవాసులకు ఇబ్బందులు తొలగాయి. దమ్మాయిగూడ మెయిన్‌రోడ్డుకు చేరుకోవాలంటే నిన్నటి దాకా 3 కి.మీ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేదని, ఇక నుంచి100 మీటర్లు ప్రయాణిస్తే సరిపోతోందని సీనియర్ సిటిజన్ కాలనీ వాసులు తెలిపారు.
అలాగే మల్కాజిగిరి సర్కిల్ సైనిక్‌పురి ఆర్మీ ఆఫీసర్ల కాలనీ వెళ్లకుండా అడ్డుగా నిర్మించిన 50 మీటర్ల ప్రహరీని హైడ్రా అధికారులు తొలగించారు. అక్కడి డిఫెన్స్ కాలనీలోని సర్వే నంబరు 218/1లో ప్రజావసరాలకు కేటాయించిన 1,200 గజాల స్థలాన్ని అసోసియేషన్పెద్దలు ప్లాట్లుగా మార్చి విక్రయించారంటూ ఇటీవల స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారులతో కలిసి విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు సదరు స్థలాన్ని 5 ప్లాట్లుగా మార్చినట్లు గుర్తించారు. కొన్ని అమ్మగా, మిగిలినవి అసోసియేషన్ ఆధీనంలో పెట్టుకున్నట్టు నిర్ధారించారు. బుధవారం ఆ ప్లాట్లను స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీ ల్యాండ్‌గా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.
ఓర్ఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై కూల్చివేతలు
శంషాబాద్ మండలం రాళ్లగూడ వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు వెళ్లకుండా అడ్డుగా నిర్మించిన 155 మీటర్ల ప్రహరీని హైడ్రా అధికారులు తొలగించారు. దీంతో రాళ్లగూడతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలగాయి. -నిజాంపేట రోడ్డులోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీని హైడ్రా తొలగించింది. అదే స్థలంలో తనకు కేటాయించిన 300 గజాల ఇంటి స్థలం ఉందని, అది కబ్జాకు గురైందని ఓ మాజీ సైనికుడు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపగా.. దాదాపు 1,253 గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టు తేలింది. ప్రహరీని తొలగించి హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ సైనికుడి భూమిని ఆయనకు అప్పగించనున్నారు..