
- ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ప్రజావాణికి సోమవారం 63 ఫిర్యాదులు రాగా, కమిషనర్ రంగనాథ్ స్వీకరించారు. ఇందులో పాత లేఅవుట్ల ఆక్రమణలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. తుర్కయాంజల్ చెరువులోకి వెళ్లే వాన నీటికి అడ్డంగా గోడ కట్టడంతో వరద తమ కాలనీని ముంచెత్తుతోందని ఏవీనగర్-2కు చెందిన బాధితులు ఫిర్యాదు చేశారు. అలాగే ఘట్కేసర్మండలం ప్రతాపసింగారంలో 25.17 ఎకరాల్లో 390 ప్లాట్లతో 1989లో లేఅవుట్ వేయగా, దాదాపు 6.14 ఎకరాల్లో ఉన్న 88 ప్లాట్లు కబ్జాకు గురయ్యాయని బాధితులు హైడ్రాను ఆశ్రయించారు. గతంలో ఈ భూమిని తండ్రి అమ్మగా, ప్రస్తుతం అతని కొడుకు కబ్జా చేసి, ధరణి పాస్‌పుస్తకం ద్వారా రైతు బంధు డబ్బులు కూడా తీసుకున్నారన్నారు.
మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని దేవేందర్‌నగర్ కాలనీ సర్వే నంబరు 63/1లోని 1200 గజాల ప్రభుత్వ స్థలాన్ని పలువురు కబ్జా చేస్తున్నారని, పక్కనే ఉన్న ప్రభుత్వ స్కూల్‌కు ఆ స్థలాన్ని కేటాయిస్తే గ్రౌండ్లా వాడుకోవచ్చని కాలనీ వీకర్ సెక్షన్ సొసైటీ ప్రతినిధులు వినతి పత్రం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని శ్రీరంగాపురం 24వ వార్డులో 1050 గజాల పార్కు స్థలాన్ని అక్కడి మాజీ ప్రజాప్రతినిధి కబ్జా చేశారని కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అక్కడ ఆరు కాలనీలకు వెళ్లే దారిని కూడా కబ్జా చేయడంతో తొవ్వ లేకుండా పోయిందని వాపోయారు.
టౌన్ ప్లానింగ్‌కే ఎక్కువ
జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ ఇలంబరితి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 79 ఫిర్యాదులు రాగా, టౌన్ ప్లానింగ్ కు 49, ట్యాక్స్ సెక్షన్ కు12, ఇతర విభాగాలకు ఒకటి నుంచి మూడు వరకు, ఫోన్ ఇన్ ద్వారా రెండు ఫిర్యాదులు వచ్చాయి. ఆరు జోన్లలో మొత్తం 108 ఫిర్యాదులు రాగా, కూకట్ పల్లిలో 56, సికింద్రాబాద్ లో 13, శేరిలింగంపల్లిలో 18, చార్మినార్, ఎల్బీనగర్ లో10 చొప్పున, ఖైరతాబాద్ జోన్ లో ఒక్క ఫిర్యాదు వచ్చింది.
కలెక్టరేట్లో 80 దరఖాస్తులు
హైదరాబాద్కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో నిర్వహించిన ప్రజావాణికి 80 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్కలెక్టర్లు కదిరివన్ పలని, డాక్టర్ ముకుంద రెడ్డి తెలిపారు. గృహ నిర్మాణ శాఖకు 24, పెన్షన్ల గురించి 29, రేషన్ కార్డుల కోసం ఏడు , ఇతర శాఖలకు సంబంధించినవి 20 వచ్చాయన్నారు.
వికారాబాద్‌లో 99
ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ ప్రజావాణికి 99 అర్జీలు రాగా, భూ సమస్యల ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు.