
కాగజ్ నగర్, వెలుగు : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు మాజీ ఎమ్మెల్యే కోనప్ప బుధవారం ప్రకటించారు. బీఎస్పీ, బీఆర్ఎస్ అనైతిక పొత్తు ఘోరమైన బాధ కలిగించిందని, అందుకే రేవంత్ రెడ్డి సారథ్యంలో పనిచేసేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. బుధవారం కాగజ్‌నగర్‌లోని తన ఇంటికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, సిర్పూర్ నియోజకవర్గం ఇన్చార్జి రావి శ్రీనివాస్‌తో కోనప్ప చర్చలు జరిపారు. రాజకీయ వైరుధ్యంతో 20 ఏండ్లపాటు ప్రత్యర్థులుగా ఉన్న తన మేనల్లుడు రావి శ్రీనివాస్‌తో పాటు ఆయన సోదరుడు రావి మురళిని ఆప్యాయంగా పలకరించారు.
తర్వాత నిర్వహించిన ప్రెస్మీట్లో కోనప్ప మాట్లాడుతూ గురువారం సాయంత్రం పట్టణంలోని ఫంక్షన్ హల్లో నిర్వహించే కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. మొన్నటివరకు తనను, తన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించిన బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఆ బాధతోనే పార్టీ మారుతున్నానన్నారు. జడ్పీ చైర్మన్ కృష్ణారావు, మున్సిపల్ చైర్ పర్సన్ షాహిన్ సుల్తానా, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతారన్నారు. విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. బలమైన ప్రజా నాయకుడైన కోనప్ప కాంగ్రెస్ లోకి రావడం మంచి విషయమన్నారు.