
- కంచ గచ్చిబౌలి మార్ఫింగ్ ఫొటోలు ఎక్స్‌లో పోస్ట్ చేసిన స్మిత
- ఈ నెల 11న నోటీసులు జారీ చేసిన గచ్చిబౌలి పోలీసులు
- బుధవారం విచారణకు గైర్హాజరైన స్మితా సబర్వాల్
హైదరాబాద్, వెలుగు: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసినందుకు గాను ఈ నెల11న నోటీసులు జారీ చేశారు. ఎక్స్‌లో రీపోస్ట్ చేసిన ఫొటోలకు సంబంధించిన సమాచారం అందించాలని పేర్కొంటూ బీఎన్‌ఎస్ 179 సెక్షన్ కింద నోటీసులు అందించారు. నోటీసుల ప్రకారం బుధవారమే పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆమె గైర్హాజరయ్యారు.
దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. స్మితా సబర్వాల్ ప్రస్తుతం యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి మార్చి 31న ‘‘హాయ్ హైదరాబాద్’’ అనే ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన జిబ్లీ ఫొటోను ఆమె రీపోస్ట్ చేశారు. దీని ఆధారంగా పోలీసులు నోటీసులు అందించారు.
మార్ఫింగ్, ఎడిటెడ్ ఫొటోలు ఎక్స్‌లో రీపోస్ట్
హెచ్‌సీయూ మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు, నెమలి, జింకలు ఉన్నట్లుగా మార్ఫింగ్, ఎడిట్ చేసిన ఫొటోను ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు క్రియేట్ చేసిన ఏఐ వీడియోలు, ఫొటోలతో సోషల్‌మీడియాలో విస్తృతంగా తప్పుడు ప్రచారం జరిగింది.
దీని వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రాథమిక ఆధారాలతో ఎక్స్ సహా సోషల్ మీడియా హ్యాండ్లర్లు, యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్‌సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా స్మితా సబర్వాల్ పోస్ట్ చేసిన మార్ఫింగ్ ఫొటోను గుర్తించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని సూచించారు.