స్మితా సబర్వాల్ మేడమ్..
మీరెప్పుడైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కారా?
భరతనాట్యం చేసి ఏ ఒక్కరినైనా మెప్పించారా?
ఒలింపిక్స్‌లో పాల్గొని మెడల్ ఏమైనా తెచ్చారా? పోనీ.. కనీసం సివిల్స్ లో హయ్యెస్ట్ స్కోర్ అయినా సాధించారా? లేదు కదూ!
కానీ.. ట్రెయిన్లో నుంచి దొంగలు తోసేస్తే ఒక కాలును పోగొట్టుకుని, వెన్నెముక గాయాలకు గురైన అరుణిమా సిన్హా ఎవరెస్ట్ ఎక్కింది. ఎవరెస్టును అధిరోహించిన ప్రపంచంలోనే తొలి ఫిమేల్ యాంప్యుటీగా ఘనత సాధించింది.
యాక్సిడెంట్లో ఒక కాలును పోగొట్టుకున్న
సుధా చంద్రన్ భరతనాట్యంలో మేటిగా నిలిచింది.
స్పైన్ ట్యూమర్ వల్ల నడుము కింది భాగం కదలికలు కోల్పోయినా.. పట్టుదలతో పారాలంపిక్స్‌లో పాల్గొని దేశానికి మెడల్ తెచ్చిన తొలి ఫీమేల్ పారాలంపియన్గా సత్తా చాటింది దీపా మాలిక్.
స్కోలియోసిస్ సమస్య బారిన పడిన ఇరా సింఘాల్ 2014 సివిల్స్‌లో హయ్యెస్ట్ స్కోర్ సాధించి.. దేశంలోనే తొలి దివ్యాంగ మహిళా సివిల్ సర్వెంట్‌గా నిలిచింది.
ఇప్పుడు చెప్పండి మేడమ్.. వీళ్లలో ఏ ఒక్కరైనా కాళ్లూ చేతులూ ముక్కూ మొఖం అన్నీ బాగున్న మీకంటే తీసిపోయారా? వీళ్లలో ఏ ఒక్కరి సామర్థ్యమైనా మీకంటే తక్కువైపోయిందా?
‘‘ఒక దివ్యాంగుడిని ఏ ఎయిర్ లైన్స్ సంస్థ అయినా పైలెట్‌గా నియమించుకుంటుందా? ఒక దివ్యాంగుడు సర్జన్ అయితే మీరు అతడిని నమ్ముతారా?’’ అని అన్నారు కదూ. కానీ, పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా ప్రపంచంలోనే తొలి ఫీమేల్ ఆర్మ్ లెస్ పైలెట్ గా లైసెన్స్ పొంది విమానాలు నడిపిన అమెరికన్ దివ్యాంగురాలు జెస్సికా కాక్స్ గురించి.. ఆమె టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించిన ఘనత మీకు తెలిసి ఉండకపోవచ్చు! చిన్నప్పుడే పోలియో బారిన పడినా.. కష్టపడి చదివి డాక్టర్ అయి ప్రముఖ సర్జన్ గా పేరు పొందిన డాక్టర్ సత్యేంద్ర సింగ్ గురించీ.. పోలియో బాధితుడైనా ప్రముఖ ఆంకాలజిస్ట్‌గా ఎదిగిన డాక్టర్ సురేశ్ హరిరామ్ అద్వానీ గురించి కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు! ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్, లూయిస్ బ్రెయిలీ, హెలెన్ కెల్లర్ వంటి వాళ్ల గాథలు కూడా మీ ‘కొంచెం మనసు’కు తట్టి ఉండకపోవచ్చు! కేంద్ర మంత్రిగా అనేక శాఖలను విజయవంతంగా నిర్వహించి.. మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లను ఎంతోమందిని ముందుండి నడిపించిన ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి అయినా మీకు గుర్తు రాలేదా..? పోలియోతో కాళ్లు చచ్చుబడిపోయినా.. తన వాగ్ధాటి, అపర మేధస్సుతో దేశంలోనే మేటి నాయకుడిగా ఎదిగిన ఆయన తెలంగాణ కల సాకారానికీ కీలక పాత్ర పోషించిన విషయమైనా యాదికి రాలేదా? ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. మీకంటే అద్భుతమైన శక్తిసామర్థ్యాలు చాటిన దివ్యాంగులు లక్షలాది మంది ఉన్నారని.. టీచర్లుగా, లెక్చరర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, క్లర్కులుగా, జర్నలిస్టులుగా.. ఇలా అన్ని రంగాల్లోనూ దివ్యాంగులు రాణిస్తున్నారన్న విషయం కూడా మీకు తెలియకపోవడం విచారకరం!
మేం యుద్ధం చేస్తున్నాం..
ఇంత పెద్ద దేశంలో ఏడాదికి ఒకరో ఇద్దరో దివ్యాంగులు సివిల్ సర్వెంట్లు అయితే.. ఇంత కడుపుమంటా? మీరు రోజూ బస్సుల్లో అవస్థలు పడుతూ, నడుచుకుంటూ ఫీల్డుకు వెళ్తున్నారా? అయినా దివ్యాంగులకు సామర్థ్యం లేదని నిర్ధారించేందుకు మీరు ఎవరు? విధి వంచితులమైన దివ్యాంగులం ప్రతిరోజూ ఇంటా, బయటా, వీధుల్లో, ఆఫీసుల్లో, బస్సుల్లో, ట్రెయిన్లలో యుద్ధం చేస్తున్నాం. కాళ్లూ చేతులూ ముక్కూ మొఖం సక్కగా ఉన్న మీకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కష్టపడుతూ యుద్ధం చేస్తున్నాం మేడమ్. ఇంట్లో చిన్నచూపే.. బయటా చిన్నచూపే.. కష్టపడి ఉద్యోగాలు, ఉపాధి సంపాదించినా.. పెండ్లిండ్లు కూడా కాకుండా ఒంటరులమై వెలివేతలకు గురవుతున్నాం. దివ్యాంగులు కూడా మనుషులే.. వారిని కూడా సమాజంలో భాగస్వాములను చేయాలన్న సదుద్దేశంతో కొన్ని స్కీంలు, రిజర్వేషన్లు ఇస్తే.. వాటిని అమలు చేయాల్సిన స్థానంలో ఉన్న మీరు ఇలాంటి ప్రకటనలు చేయడం దురదృష్టకరం. ఏ ఉద్యోగానికి ఎలాంటి ఫిట్నెస్ కావాల్నో నిర్ణయించిన పార్లమెంట్, సుప్రీంకోర్టు కంటే మీకే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయనుకోవడం మీ మూర్ఖత్వం మేడమ్!
క్షమాపణ చెప్పండి.. లేదా తప్పుకోండి
‘ది ఓన్లీ డిజేబిలిటీ ఇన్ లైఫ్ ఈజ్ ఏ బ్యాడ్ ఆటిట్యూడ్’’ అంటాడు అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫిగర్ స్కేటింగ్ స్టార్ స్కాట్ హమిల్టన్. శరీరంలో ఏదో ఒక లోపం ఉండటం వైకల్యం కాదు.. మంచి వైఖరి లేకపోవడమే అసలైన వైకల్యం అన్నది దీని సారాంశం. ఇంకా నయం మేడమ్.. మీరు యూపీఎస్సీ చైర్మనో లేదంటే దివ్యాంగుల శాఖ అధిపతో గనక అయ్యుంటే.. మా దివ్యాంగుల పరిస్థితి ఎలా ఉండేదో తలచుకుంటేనే ఒళ్లు ఝలదరిస్తోంది. క్షమాపణలు చెప్పి తప్పును దిద్దుకోవాల్సింది పోయి.. ఇంకా సమర్థించుకుంటున్నారంటేనే మీకు తత్వం బోధపడలేదని తెలుస్తోంది. సాటి మనుషుల పట్ల మానవత్వం లేకపోవడమే కాకుండా చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటేనే మీరు మెంటల్‌గా ఫిట్‌గా ఉన్నారా? లేదా? అన్న సందేహం వస్తోంది. ఇప్పటికైనా మీరు దివ్యాంగ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. లేదంటే ఐఏఎస్ పదవి నుంచి తప్పుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం!
రేవంత్ సార్.. న్యాయం చేయండి..
సీఎం రేవంత్ రెడ్డి సార్.. చూస్తున్నారు కదా! అసలు దివ్యాంగులు ఎందుకూ పనికిరారు అన్నట్టుగా.. మీ ప్రజా పాలనలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి ప్రవర్తన. హక్కుల కోసం ఎన్నడూ పిడికిలెత్తని.. కనీసం గొంతెత్తని లక్షలాది మంది దివ్యాంగుల కమ్యూనిటీని ఇంత అవమానించిన ఆఫీసర్ మీ ప్రభుత్వంలో ఉండటం మీకే చెడ్డ పేరు తెస్తుంది సార్. దయచేసి ఆమెపై కఠిన చర్యలు తీసుకుని.. దివ్యాంగుల సంక్షేమం పట్ల మీ చిత్తశుద్ధిని చాటుకుని మాకు న్యాయం చేయండి సార్!
‘మనసు వంకర’ కంటే వైకల్యం ఉన్నదా!
స్మితా మేడమ్.. చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్టుగా.. ఉన్నత విద్యావంతురాలైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉన్న మీరు.. సామాజిక వెలివేతలను ఎదుర్కొంటూ అడుగడుగునా యుద్ధం చేస్తున్న దివ్యాంగుల గురించి ఇంత చవకబారు పోస్టు పెట్టడం మీ పరిణతిని చెప్పకనే చెప్తోంది. నిజమే.. మాలో కొందరికి కాళ్లు లేవు. మరికొందరికి చేతులు లేవు. కొందరికి చూపు ఉండదు. మరికొందరికి వినికిడి ఉండదు. కానీ.. ‘మనసు వంకర’కు మించిన వైకల్యం ఏముంటుంది మేడమ్! నిజమే.. మేం ఆర్మీ జవాన్లలా, పోలీసుల్లా డ్యూటీలు చేయలేం. కానీ, మీరు చెప్తున్న ప్రీమియర్ పోస్టు అయిన ఐఏఎస్ అయితే అద్భుతంగా పని చేసి చూపించగలం. ఇందుకోసం సమాజాన్ని ప్రజా సమస్యలను చక్కదిద్దే నేర్పు ఉంటే చాలు కదా!. ఏంటీ.. మేడమ్? డిఫెన్స్, ఐపీఎస్, ఐఏఎస్ జాబ్స్ కు తేడా లేదా? మరి మీరు ఎప్పుడైనా యాంటీ నక్సల్ ఆపరేషన్ కోసం తుపాకీ పట్టుకుని అడవికి పోతున్నారా? లేదంటే బార్డర్ కు వెళ్లి గస్తీ కాస్తున్నారా? రేపు ప్రమాదవశాత్తు మీకు ఒక కాలో, చెయ్యో పోతే.. అప్పుడు ఐఏఎస్ కు పనికిరానని తప్పుకుంటారా మేడమ్!
- హన్మిరెడ్డి యెద్దుల దివ్యాంగ జర్నలిస్ట్