కోహ్లీ సూపర్ సెంచరీ.. పాకిస్థాన్‎పై భారత్ ఘన విజయం

కోహ్లీ సూపర్ సెంచరీ.. పాకిస్థాన్‎పై భారత్ ఘన విజయం

ఇండియా, పాకిస్థాన్ దేశాలతో పాటు యావత్ ప్రపంచ క్రికెట్ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన మ్యాచులో దాయాది పాకిస్థాన్‎పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్ మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన భారత్.. చిరకాల ప్రత్యర్థిని 6 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. 

బౌలింగ్‎లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(3 వికెట్లు), హార్ధిక్ పాండ్యా(2 వికెట్లు) రాణించగా.. బ్యాటింగ్‎లో టీమిండియా స్టార్ బౌలర్ విరాట్ కోహ్లీ(100 నాటౌట్) సూపర్ సెంచరీతో ఆకట్టుకోవడంతో టీమిండియా సునాయంగా విజయం సాధించింది. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలోనే ఆడుతు పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్‎పై తాజా విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సెమీస్‎ రేసులోకి దూసుకెళ్లింది.

ఈ మ్యాచులో 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు సరైన శుభారంభం దక్కలేదు. ఓపెనర్స్ రోహిత్, శుభమన్ గిల్ దూకుడుగానే ఇన్సింగ్స్‎ను ఆరంభించిన.. పాక్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిది అద్భుతమైన యార్కర్‎తో భారత కెప్టెన్‎ను పెవిలియన్‎కు పంపాడు. 15 బంతుల్లో 20 పరుగులు చేసి రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. మరో ఓపెనర్ శుభమన్ గిల్‎తో కలిసి ఇన్సింగ్స్‏ను నిర్మించారు.

 కోహ్లీ, గిల్ ఆచితూచీ ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. సింగిల్స్ డబుల్స్ తీస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీకి (46) చేరువైన శుభమన్ గిల్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్‎లో అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, కోహ్లీ కలిసి భారత్‎ను విజయం దిశగా నడిపించారు. ఓ ఎండ్‎లో కోహ్లీ నిలకడగా ఆడుతుండగా.. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ఫోర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

 ఈ క్రమంలోనే అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వేగంగా ఆడేందుకు ప్రయత్నించగా.. అయ్యర్ (56) కుష్ దీల్ బౌలింగ్‎లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా (8) వచ్చి రాగానే ఓ ఫోర్ కొట్టి ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో అక్షర్ పటేల్, కోహ్లీ కలిసి భారత్‎కు విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది రెండు వికెట్లు తీయగా.. అబ్రార్, కుష్దీల్ చెరో వికెట్ పడగొట్టారు.

కాగా, అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‎ ఒక మాదిరి స్కోర్‎కే పరిమితమైంది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 49.4 ఓవర్లలో 241 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. టాపార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ 68 పరుగులు చేసి పాక్ టాప్ స్కోరర్‎గా నిలిచాడు. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‎కు మంచి ఆరంభం లభించింది. ఇమామ్ ఉల్ హక్(10), బాబర్ అజామ్(23) తొలి వికెట్ కు 50 బంతుల్లో 41 పరుగులు జోడించారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో పాకిస్థాన్ కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత కెప్టెన్ రిజ్వాన్, సౌద్ షకీల్ తీసుకున్నారు. మొదట తడబడిన వీరిద్దరూ.. ఆ తర్వాత భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. మూడో వికెట్‎కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‎ను చక్క బెట్టారు.

ఈ దశలో భారత బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. దీంతో 14 పరుగుల స్వల్ప వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఖుష్దిల్ షా, అఘా సల్మాన్ 35 పరుగుల స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సల్మాన్ తో పాటు పాక్ లోయర్ ఆర్డర్ విఫలమైనా చివరి వరకు క్రీజ్ లో ఉండి ఖుష్దిల్ షా (38) పాక్ స్కోర్ ను 240 పరుగులకు చేర్చాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్య రెండు వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్, జడేజా, హర్షిత్ రాణాలకు తలో వికెట్ దక్కింది.