ప్రస్తుతం ఐపీఎల్ హడావుడిలో టీమిండియా ప్లేయర్స్ బిజీగా ఉన్నారు. మరో 40 రోజుల పాటుఈ సమరం జరగనుంది. అయితే అంతకంటే ముందు టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ను ఎంపిక చేయనున్నారు. జట్లను ప్రకటించాడనికి ఐసీసీ కటాఫ్ తేదీ మే 1 అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో బీసీసీఐ టీ20 ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్ రౌండర్ గా హార్దిక్ స్థానం ప్రశ్నర్ధకంగా మారింది.
నిన్నటివరకు హార్దిక్ పాండ్య స్థానానికి ఎలాంటి ప్రమాదం లేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో పాండ్య తేలిపోతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఒకటి రెండు అడపాదడపా ఇన్నింగ్స్ లు మినహాయిస్తే ఈ ఆల్ రౌండర్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మరోవైపు శివం దూబే ప్రతి మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన 6 మ్యాచ్ ల్లో 5 ఇన్నింగ్స్ ల్లో 60 యావరేజ్ తో 242 పరుగులు చేశాడు. అంతకముందు టీమిండియా తరపున దూబే నిలకడగా రాణించాడు.
also read : అదే చివరి ఐపీఎల్ మ్యాచ్: ముస్తాఫిజుర్ కోసం బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్
ఐపీఎల్ లో పాండ్య బౌలింగ్ వేయకపోతే దూబే అతన్ని రీప్లేస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. పాండ్య ఎంపిక విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాండ్య పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ సాధించలేదని కొంతమంది చెప్పుకొస్తున్నారు. దీనికి తోడు పేలవ ఫామ్ అతన్ని రేస్ లో వెనక్కి నెట్టే అవకాశం ఉంది.
జూన్ 1 నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 29న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.