
- ఐసెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్
నల్గొండ అర్బన్, వెలుగు : తెలంగాణ ఐసెట్–2025–-26 విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ గురువారం విడుదల చేసినట్లు ఐసెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉన్నత విద్యామండలి ఐసెట్నిర్వహణ బాధ్యతను మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి ఇచ్చినట్లు తెలిపారు. జూన్ 8,9 తేదీల్లో రాష్ర్టవ్యాప్తంగా 4 షిఫ్ట్‌ల్లో ఆన్లైన్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మార్చి 10 నుంచి మే 3 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చున్నారు.
రూ.50 అపరాధ రుసుంతో మే 17 వరకు, రూ.500 అపరాధ రుసుంతో మే 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, సాధారణ అభ్యర్థులు రూ.750 పరీక్ష రుసుం చెల్లించాలని వెల్లడించారు. ఆన్లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు మే 16 నుంచి మే 20 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
నాలుగు విడతలుగా జరగనున్న ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష ప్రాథమిక- కీ జూన్ 21 న విడుదల చేసి, అభ్యంతరాలకు జూన్ 22 నుంచి జూన్ 26 వరకు అవకాశం కల్పించనున్నట్లు వివరించారు. జూలై 7న తుది కీ విడుదల చేయనున్నట్లు ఆచార్య అల్వాల రవి తెలిపారు.