- ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌కు చేరిక
- క్వార్టర్స్‌లో నవారోపై గెలుపు
- కీస్, సినర్, షెల్టన్ ముందంజ
మెల్‌బోర్న్: పోలెండ్ స్టార్ ప్లేయర్ ఇగా స్వైటెక్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో రెండోసీడ్ స్వైటెక్ 6–1, 6–2తో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఆడుతున్న స్వైటెక్.. మెల్‌బోర్న్ పార్క్‌లో తొలి టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఓవరాల్‌గా కెరీర్‌లో 6వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న పోలెండ్ ప్లేయర్ ఇప్పటి వరకు 14 గేమ్‌లను మాత్రమే కోల్పోయింది.
గతంలో షరపోవా 15 గేమ్స్ కోల్పోయి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌కు చేరిన చివరి మహిళగా నిలిచింది. గంటా 29 నిమిషాల మ్యాచ్‌లో స్వైటెక్‌కు నవారో నుంచి పెద్ద ప్రతిఘటన ఎదురుకాలేదు. పదునైన సర్వీస్‌లు, బలమైన గ్రౌండ్ స్ట్రోక్స్‌తో పాటు ఫోర్ హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ వ్యాలీలతో స్వైటెక్ అదరగొట్టింది. రెండో సెట్‌లో డబుల్ బౌన్స్ నో కాల్ కూడా ఆమెకు కలిసొచ్చింది. దీనిపై నవారో రివ్యూ అడగకపోవడం మైనస్‌గా మారింది. మ్యాచ్ మొత్తంలో ఒక్క ఏస్, రెండు ఫాల్ట్స్ చేసిన స్వైటెక్ తన సర్వీస్‌లో 82 శాతం పాయింట్లు రాబట్టింది.
22 విన్నర్లు, 20 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. 9 బ్రేక్ పాయింట్లలో ఐదింటిని కాచుకుంది. ఇక తన సర్వీస్‌ల్లో 49 శాతం పాయింట్లే సాధించిన నవారో ఒక్క బ్రేక్ పాయింట్ కూడా కాచుకోలేదు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో మాడిసన్ కీస్ (అమెరికా) 3–6, 6–3, 6–4తో ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై నెగ్గి..స్వైటెక్‌తో సెమీస్ పోరుకు రెడీ అయ్యింది. మెన్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ జానిక్ సినర్ (ఇటలీ) 6–3, 6–2, 6–1తో డి మినుయెర్ (ఆస్ట్రేలియా)పై గెలవగా, బెన్ షెల్టన్ (అమెరికా) 6–4, 7–5, 4–6, 7–6 (7/4)తో లోరెంజో సోనెగో (ఇటలీ)ని ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు.