అలీసాగర్​ రిజర్వాయర్​కు ముప్పు !

 అలీసాగర్​  రిజర్వాయర్​కు ముప్పు !
  • అలీసాగర్​ రిజర్వాయర్​ ప్రక్కనే మొరం తవ్వకాలు 
  • నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్​, రెవెన్యూ శాఖల అధికారులు

ఎడపల్లి,  వెలుగు : ఇరిగేషన్​, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంగా మొరం తవ్వకాల దందా మూడు పువ్వులు, కాయల్లా కొనసాగుతున్నది.  ఎడపల్లి మండలంలోని తానాకలాన్ రెవెన్యూ శివారులో అలీసాగర్​ రిజర్వాయర్​ ప్రక్కనే గుట్ట ఉంది. ఎలాంటి అనుమతులు లేకున్నా వ్యాపారులు మొరం కోసం జేసీబీలతో నిత్యం యధేచ్ఛగా తవ్వేస్తున్నారు.  టిప్పర్ల ద్వారా మొరం  అక్రమ రవాణా చేస్తూ లాభాలు గడిస్తున్నారు.  ఇంత జరుగుతున్నా ఇరిగేషన్,  రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.

గుట్టను రోజురోజుకూ తవ్వుకుంటూ పోతే రిజర్వాయర్​ ముప్పు వాటిల్లే ప్రమాదమున్నది. మొరం కోసం వందలాది చెట్లను తొలగిస్తున్నా సంబంధిత అధికారులు నిద్రమత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొరం తవ్వకాలు, చెట్ల నరికివేతపై స్థానికులు అధికారులకు సమాచారమిచ్చినా స్పందించకపోవడం విశేషం.  సెలవు రోజుల్లో రెవెన్యూ అధికారులు ఉండరు కాబట్టి ఇష్టానుసారంగా మొరం తరలిస్తున్నారు. మండల తహసీల్దార్​కు తెలుపాలన్న ఉద్దేశంతో స్థానికులు ఫోన్​ చేయగా,  రెండు రోజులుగా ఫోన్​ స్విచ్​ ఆఫ్​లో ఉంది. పోలీసులు సైతం చర్యలు తీసుకోకపోవడంతో వారితో కుమ్మక్కైయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.