
- బెల్ట్‌షాపుల్లోనూ విచ్చల విడిగా సేల్
- మామూళ్లు తీసుకుంటూ పట్టించుకోని ఎక్సైజ్‌శాఖ
- గతంలో అందించిన రూ.100 కోట్లకుపైగా ప్రభుత్వ సాయం వృథా
- సాయం పొందిన వాళ్లే మళ్లీ తయారీ, అమ్మకాలు చేస్తున్న వైనం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ఉమ్మడి వరంగల్ పల్లెల్లో మళ్లీ సారా తయారీ, అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. బెల్ట్ షాపులు గుడుంబా అమ్మకాలకు అడ్డాగా మారాయి. దీన్ని కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ శాఖ వసూళ్లకు పాల్పడుతూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు మద్యం రేట్లు పెరగడంతో గుడుంబా తాగేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో గుడుంబాకు డిమాండ్ పెరుగుతోంది. ఎవరైతే ప్రభుత్వ సాయం పొందారో మళ్లీ వాళ్లే గుడుంబా తయారీ, అమ్మకాలు చేస్తూ అక్రమ సంపాదనకు అలవాటుపడుతున్నారు.
రూ.కోట్లలో నిధులు వృథా
గుడుంబా రహిత రాష్ట్రంగా చేసేందుకు తయారీ, అమ్మకం దారులకు రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పించడం, సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల చొప్పున అందించింది. ఒక్కో ఉమ్మడి జిల్లాకు రూ.10 కోట్లకు పైగా నిధులు వెచ్చించింది. ఇలా ఎక్సైజ్ శాఖ, ఐకేసీ ద్వారా రాష్ట్రంలో గత ప్రభుత్వం రూ.100 కోట్లకుపైగా అందించింది.
బెల్ట్ షాపుల్లోనూ అమ్మకాలు
గుడుంబాను ప్యాకెట్లలో సప్లయ్ చేస్తుండగా ప్రతి ఊరిలో ఐదారు గుడుంబా అమ్మే షాపులు ఉన్నాయి. బెల్ట్‌షాపుల్లో కూడా అమ్ముతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం పొందిన వాళ్లలో మళ్లీ 70 శాతం మందికిపైగా గుడుంబా తయారీ, అమ్మకాలు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లాలో మళ్లీ గుడుంబా తయారీ, అమ్మకాలు పెరిగిపోతున్నాయి. సారా తాగడంతో వ్యక్తుల అవయవాలు దెబ్బతిని చనిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏటేటా వితంతువుల సంఖ్య పెరుగుతుంది. ఆసరా పెన్షన్ 1.80 లక్షల మంది మహిళలు తీసుకుంటుండగా వీరిలో 30 ఏండ్లలోపు ఉన్న వితంతువులే 60 వేలకు పైగా ఉన్నట్లుగా డీఆర్‌డీవో ఆఫీసర్లు చెబుతున్నారు.
ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం
చాపకింద నీరులా గుడుంబా తయారీ, అమ్మకాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లు మామూళ్లు తీసుకుంటూ బెల్లం, పటిక రవాణాను ప్రోత్సహిస్తున్నట్లుగా ప్రజలు చెబుతున్నారు. తనిఖీల్లో పట్టుబడితే గుడుంబాను స్వాధీనం చేసుకుని వెళ్లిపోతున్నారే తప్ప కేసులు నమోదు చేయడం లేదంటున్నారు. గుడుంబా నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవడంలేదంటున్నారు. ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగానే గిరిజన గూడెంలు, తండాల్లో మళ్లీ గుడుంబా అమ్మకాలు జోరుగా సాగుతున్నట్టు పేర్కొంటున్నారు.
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన ఓ వ్యక్తి గతంలో గుడుంబా తయారు చేస్తూ ఎక్సైజ్ అధికారులకు దొరికాడు. గుడుంబా తయారీని ఆపేసిన అతనికి స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం రూ.లక్ష సాయం అందించింది. అనంతరం కొంతకాలం మానేశాడు. మళ్లీ గుడుంబా తయారీ స్టార్ట్ చేశారు. రోజుకు సుమారు వెయ్యి ప్యాకెట్లు తయారు చేసి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నాడు.’’
హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన ఓ మహిళ గుడుంబా అమ్ముతుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆమె స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రూ.2 లక్షల సాయం అందించింది. బెల్ట్‌షాపు పెట్టుకుని మద్యం అమ్మేది. ఇప్పుడు మళ్లీ గుడుంబా అమ్మకాలు కొనసాగిస్తుంది. రోజుకు రెండొందల మందికి గుడుంబా అమ్ముతూ అక్రమంగా సంపాదిస్తుంది.’’
గుడుంబా తయారీ గ్రామాలివే
భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని మహాముత్తారం, కొర్ల కుంట, లంబాడిపల్లి, పొలారం, నిమ్మగూ డెం, యామన్ పల్లి, యత్నారం, పెగడపల్లి, ప్రేమనగర్, బోర్లగూడెం, గాండికామారం, చింతలపల్లి, కనుకునూర్, పొలంపల్లి, కొనంపేట, నర్సింగపూర్, నల్లగుంట మీనాజీపేట, స్తంభపల్లి(పీకే), సింగారం, జీలపల్లి, పర్లపల్లి, మల్హర్ మండలంలోని ఆన్సాన్ పల్లి, దుబ్బపేట, అడ్వాలపల్లి, తాడిచెర్ల, కొయ్యూరు, చిట్యాల మండలం లోని అందుకుతండా, ఒంటిప్పతండా, పాశిగడ్డతండా, లక్ష్మిపురంతండా, గిద్దె ముత్తారంతండా, రేగొండ మండలంలో ని రావులపల్లి, అర్జీ తండా, జగ్గయ్యపేట, బాగిర్తిపేట, దుంపిల్లపల్లి, గోరికొత్త పల్లి, నిజంపల్లి, మంగపేట మండలం కమలాపురంలోని ఇందిరా కాలనీ, టీడీపీ కాలనీ, సుభాష్ చంద్ర బోస్ కాలనీ, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని వెంకటాపూర్, లక్ష్మీదేవిపేట, మల్లయ్యపల్లి, పాపయపల్లి, నల్లగుంట, గోవిందరావుపేట మండలంలోని పాపయ్య పల్లి, సండ్రగూడెం, బాలాజీనగర్, మొద్దుల గూడెం, ములుగు మండలం రాంనగర్ తండా, సర్వపూర్, జీవంతరావు పల్లి, తదితర గ్రామాల్లో గుడుంబా తయారీ, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.