దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కు ఎట్టకేలకు టీమిండియాలోకి పిలుపు వచ్చింది. అసాధారణ అట తీరుతో రాణిస్తున్నప్పటికీ ఈ ముంబై బ్యాటర్ కు స్థానం దక్కకపోవడంతో నెటిజన్స్ సెలక్టర్లపై విమర్శలు గుప్పించారు. జాతీయ జట్టులోకి రావడానికి అన్ని అర్హతలు ఉన్నా.. ఇప్పటివరకు స్థానం ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. హైదరాబాద్ టెస్టులో స్టార్ బ్యాటర్ రాహుల్ గాయపడటంతో సర్ఫరాజ్ ను సెలక్టర్లు కరుణించారు. దీంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఈ పరుగుల వీరుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా సర్ఫరాజ్ ఖాన్ కు పాక్ స్టార్ ఓపెనర్ ఇమాముల్ హక్ అభినందనలు తెలపడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సోషల్ మీడియాలో బ్రదర్ నువ్వు భారత జట్టులోకి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్ చేశాడు. ఒక పాక్ క్రికెటర్ భారత ఆటగాడికి మద్దతు పలకడం పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. ఇమాముల్ పై ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే సర్ఫరాజ్ కు ఇమామ్ ఎందుకు కంగ్రాట్స్ చెప్పాడో అసలు విషయం ఎవరికీ తెలియదు.
సర్ఫరాజ్ గత నాలుగు సంవత్సరాల నుంచి దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. 2019-20 సీజన్ లో 928 పరుగులు చేయడంతో పాటు 2021-22 రంజీ సీజన్ లో 6 మ్యాచ్ ల్లోనే 982 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఫిట్ నెస్, క్రమశిక్షణ లేని కారణంగా సర్ఫరాజ్ ను బీసీసీఐ ఎంపిక చేయలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ సర్ఫరాజ్ కు సెలక్ట్ చేసి అవన్నీ నిజాలు కాదని బీసీసీఐ నిరూపించింది.
ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా భారత్ రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 న వైజాగ్ వేదికగా జరగనుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్ అనూహ్యంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తో పాటు స్టార్ ఆటగాళ్లు జడేజా, రాహుల్ గాయాలు టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఇప్పటికే వైజాగ్ టెస్ట్ మ్యాచ్ కు కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరమైన సంగతి తెలిసిందే.
Congratulations brother So Happy for you ❤️❤️ pic.twitter.com/TDmKXMZYjj
— Imam Ul Haq (@ImamUlHaq12) January 29, 2024