ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు

ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
  •      ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే తెలంగాణలోకి..
  •     నిరుడు జూన్ మూడో వారంలో ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు :  ఈసారి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతా వరణ శాఖ తెలిపింది. ఈ నెలాఖరు నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోలోనే తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని గురువారం పేర్కొంది. పోయినేడాది ఎల్​నినో ప్రభావానికి తోడు బిఫర్​జాయ్​తుఫాను కారణంగా రుతుపవనాలు రాష్ట్రంలోకి చాలా ఆలస్యంగా ప్రవేశించాయి. అప్పుడు జూన్ మూడో వారంలో వచ్చాయి. 

అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం పసిఫిక్​ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గుతుండడం, లానినా పరిస్థితులు బలపడుతుండడంతో రుతుపవనాలు కూడా త్వరగానే బలపడుతున్నాయని అంటున్నారు. ఈ లెక్కన మన రాష్ట్రంలోకి జూన్​ తొలి వారంలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు ఇలాగే అనుకూలిస్తే ఈసారి వానాకాలం మంచిగవుతుందని, వర్షపాతం మెరుగ్గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.