గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణే భూసమస్యలకు పరిష్కారం!

గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణే భూసమస్యలకు పరిష్కారం!

గత  బీఆర్ఎస్  ప్రభుత్వం కారణాలు ఏమైనా గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చింది.  గ్రామీణ స్థాయిలో రైతుల వ్యవసాయ భూములకు  రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వం  ధరణి చట్టం 2020 ఫలితంగా గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను రద్దుచేసి, సుమారు 5000 మంది వీఆర్వోలను ఇతర శాఖలకు బదలాయింపు చేసింది.  గ్రామస్థాయిలో  పదోన్నతి  పేరిట  గ్రామ రెవెన్యూ సహాయకులను కొద్దిమందిని మండల స్థాయిలో జూనియర్ అసిస్టెంట్లుగా,  రికార్డ్ అసిస్టెంట్లుగా,  పదోన్నతి కల్పిస్తే మరి కొంతమందిని మున్సిపల్, ఇరిగేషన్,  మిషన్ భగీరథ తదితర శాఖల్లో సర్దుబాటు చేసింది.  దీంతో గ్రామస్థాయిలో  ఫీల్డ్ లెవల్ ఆఫీసర్లు లేకుండాపోయారు. మండల స్థాయిలో తహసీల్దార్ల అధికారాలకు కోత పడింది. 

వ్యవస్థలో  పొరపాట్లు జరిగినప్పుడు ఆ పొరపాట్లను  ప్రభుత్వం సరి చేయాలి. కానీ,  ఆ పేరుతో వ్యవస్థని కూల్చాలని చూడడం వల్ల భవిష్యత్ తరాలకు అంధకారంలాగ మారింది.   గ్రామీణ స్థాయిలో రైతులు ఎదుర్కొనే అనేక సమస్యలను నేడు మండల స్థాయిలో అధికారులు  పరిష్కరించలేకపోతున్నారు. కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి 2020 చట్టం.  నేడు అనేక  భూ సమస్యలతో  తెలంగాణలో  రైతులు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇన్ని రోజులపాటు తెలంగాణలో  ధరణి చట్టం –2020  మూలంగా  రైతులు ఎదుర్కొనే అనేక సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. 

గ్రామీణస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ

 గ్రామీణ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో తీసివేయడం మూలంగా రైతుల పరిస్థితి దీనంగా తయారైంది.  అందుకనే, 2024 ప్రారంభం నుంచి భూభారతి డ్రాప్ చట్టంను ప్రజలకు అందుబాటులో ఉంచి, ఆన్​లైన్​ ద్వారా అనేక సలహా సూచనలు స్వీకరించడం జరిగింది.  ప్రతి జిల్లాలో రైతులు, అధికారులు, ప్రజా సంఘాలు,  రాజకీయ పక్షాల అభిప్రాయాలను కూడా తీసుకొని ఒక గొప్ప చట్టంగా రూపొందించారు. తద్వారా గ్రామీణ స్థాయిలోనే ఒక రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి ఉండేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  జీవో నెంబర్ 41 ద్వారా రాష్ట్రంలో 10,954 మంది గ్రామ పరిపాలన అధికారులను (జీపీఓలు) రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి నిర్ణయం చేసింది.

  భూభారతి చట్టం ఏప్రిల్ రెండవ మాసంలో ప్రారంభించాలని ప్రభుత్వం తలపించిన నేపథ్యంలో,  మండల స్థాయిలోనే అనేక సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉన్నది.  ప్రతి సమస్యపై గ్రామీణ స్థాయిలో ఒక  నివేదికను తెప్పించుకునే అవకాశం మండలాధికారికి ఏర్పడుతుంది.  వాస్తవ విషయాలు కూడా అధికారాన్ని వికేంద్రీకరించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. 

పట్టాదారులకు న్యాయం

భూభారతి చట్టం ద్వారా గతంలో రికార్డులో కాస్తు కాలం తిరిగి రానున్నది.  పట్టాలు లేకుండా కాస్తునే  నమ్ముకుని దున్నుకొని  బతుకుతున్న రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది.  దీని ద్వారా నిజమైన మోకాకు  సంబంధం లేని కాస్తుతో సంబంధం ఉన్న రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది.  అలాగే, గతంలో ఎలాంటి రికార్డు లేకుండా ధరణిలో ఆకస్మికంగా వచ్చిన అక్రమార్కుల స్థానంలో పట్టాదారులకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది.   అన్యాయంగా  భూములు మ్యుటేషన్ జరిగినప్పుడు, ఈ  భూభారతి చట్టం ద్వారా పై అధికారులకు  అప్పీల్ కి  వెళ్లే అవకాశం కూడా ఉన్నది.  ఇక్కడ  పరిష్కారం లభించకపోతే ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు రైతులు అక్కడికి వెళ్లే అవకాశం కూడా ఉన్నది.   

 పైసా ఖర్చు కాకుండా తక్కువ కాలంలో రైతు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఈ భూభారతి చట్టం ద్వారా ఉన్నది.  సాదా బైనామా  కింద కొనుగోలు చేసిన  రైతుల దరఖాస్తులు దాదాపుగా 9,20,000 పెండింగ్​లో  ఉన్నాయి. అర్హులైనవారిని గుర్తించి వారి హక్కులను రక్షించడం ఈ చట్టం ద్వారా జరుగుతుంది.  ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, పార్ట్ బి కింద ఉన్న  భూములను ఈ చట్టం ద్వారా పరిష్కారం చేయడం  చాలా కీలకమైన అంశం.  ప్రతి పల్లెకు ఒక అధికారిని నియమించడం  రైతుల పట్ల ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఉందని  తెలపడానికి ఒక నిదర్శనం.   పల్లెలోనే ఒక అధికారి అందుబాటులో ఉన్నట్టయితే నిజమైన రైతులకు, లాభం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది.  

‘ధరణి’తో  పెరిగిన భూసమస్యలు

ధరణి చట్టం –2020 మూలంగా తెలంగాణలో  భూ సమస్యలు పెరిగాయి.  ఉదాహరణకు ఒక సర్వే నంబర్​లో  ఒక రైతు భూమిలో 30 గుంటలు ప్రభుత్వం భూసేకరణ చేస్తే, ఇంకా 10 గుంటలు రైతు పేరిట చూపెట్టాలి.  కానీ, ప్రభుత్వం సేకరించిన  ఈ 30 గుంటలు,  రైతు పేరిట ఉన్న మిగిలిన 10 గుంటలను కూడా నిషేధిత భూముల జాబితాలో కనబడుతోంది. ప్రధానంగా ఒక్క మండలంలో 300 భూ సమస్యలు ఇలాంటివి నెలకొని ఉన్నాయి.  

వీటి పరిష్కారం కోసం ధరణి మాడ్యుల్​ ద్వారా అప్లై చేసినప్పుడు,  జిల్లా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ,  సీసీఎల్ ఏ ఆఫీసుల చుట్టూ రైతులు ప్రదక్షిణాలు చేస్తున్నారు.  వీటిలో  ఎన్నిసార్లు క్లారిఫికేషన్​కు పంపినా 90% ఫైలు రిజెక్ట్ అవుతున్నాయి.  టీఎం 33 ధరణి  మాడ్యూల్లో  రైతు పేరు కరెక్షన్ లాంటివి  కూడా రిజెక్ట్ అవుతున్నాయి.  సేద్యం చేసుకుంటున్న రైతుల పేర్లు కనబడక ఎలాంటి ఆధారాలు లేకుండా కొద్దిమంది అక్రమార్కుల పేర్లు రికార్డుకు ఎక్కాయి. వీటిని సరి చేయడం కూడా కష్ట సాధ్యం అవుతుంది.  నేచర్ అఫ్ ల్యాండ్ అనగా పట్టా భూములు అయి ఉండి రికార్డులలో  పొరపాటున లావాణి పట్టాగా పడిన భూములు కరెక్షన్​కు  నోచుకోవడం లేదు.

 

 డా. మల్లారం అర్జున్​,  పూర్వ వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర నాయకుడు
 

  • Beta
Beta feature
  • Beta
Beta feature