భారతదేశం విభిన్న సంస్కృతుల, సంప్రదాయాల సమ్మేళనం. ఇక్కడ దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా స్థలాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. దేవాలయాల విషయానికి వస్తే, కొన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. వింత కథలతో, ప్రత్యేకమైన దేవతలతో కూడిన దేవాలయాలు చాలా ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి గాంచాయి. అదే తరహాలో కర్ణాటకలోని రామనగర జిల్లాలోనూ ఓ ఆలయం విశేషంగా ఆకట్టుకుంటోంది. అదే చన్నపట్న, అగ్రహార వలగెరెహళ్లి గ్రామంలో ఉన్న డాగ్ టెంపుల్.
వీరమస్తి కెంపమ్మ దేవికి కుక్కలు సంరక్షకులని అక్కడి ప్రజల విశ్వాసం. అగ్రహార వలగెరెహళ్లి గ్రామ ప్రజలు ఇక్కడి కుక్కల విగ్రహాలకు పూజలు చేస్తారు. తాము ఏ కోరికలు కోరితే అవి నెరవేరుతాయని, తమ కష్టాలు తీరుతాయని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఎవరింట్లోనైనా దొంగతనం జరిగితే కూడా వారు ఈ ఆలయంలోని కుక్కలను పూజిస్తారు. దొంగలను శిక్షించే బాధ్యతను ఈ జంతువులు తీసుకుంటాయని వారు నమ్ముతారు. ఈ నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి గురువారం, ఆదివారం కుక్కలకు ప్రత్యేక పూజలు చేస్తారు. వీరమస్తి కెంపమ్మ దేవిని పూజించిన తర్వాత ఇక్కడ పూజ కార్యక్రమం మొదలవుతుంది.
గుడి నుంచి బయటకి అడుగుపెట్టిన తర్వాత కుక్కలు గుర్తుకు రాకపోతే ఈ జంతువులు తమని కలవరపెడతాయని స్థానికుల నమ్మకం. అంతే కాదు అక్కడి ప్రజలు కుక్కలకు ప్రత్యేక గౌరవం ఇస్తారు. మిగిలిపోయిన భోజనాన్ని కూడా కుక్కలకు పెట్టరు. ఇలా చేస్తే పీడ కలలు వస్తాయని అక్కడి వారు భావిస్తారు. కుక్కలను సంరక్షించలేనివారు.. వాటిని ఈ ఆలయానికి తీసుకురావడం కూడా ఇక్కడే చూడవచ్చు.
ALSO READ :పిడుగుపాటుతో 25గొర్రెలు మృతి
టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, ఈ దేవాలయాన్ని 2010లో రమేష్ అనే వ్యాపారి నిర్మించాడు. గ్రామస్తుల కథనం ప్రకారం, గ్రామంలో రెండు కుక్కలు రహస్యంగా అదృశ్యమయ్యాయి. కొన్ని రోజుల తరువాత వీరమస్తి కెంపమ్మ దేవత కొందరికి కలలో కనిపించి, తప్పిపోయిన కుక్కలకు గుడి కట్టమని కోరింది. ఆ కల ఆధారంగా ఒక కుక్క దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి పోయిన రెండు కుక్కలను ఇక్కడ పూజించడం ఆనవాయితీగా వస్తోంది.