- కాజ్‌వేలు, కల్వర్టులే కావడంతో పైనుంచి పారుతున్న వరద
- ప్రాణాలు అరచేత పెట్టుకొని వాగులు దాటుతున్న ప్రజలు
- పది రోజుల్లోనే వాగులో కొట్టుకుపోయి మృతి
- చెందిన ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డ మరో ఐదుగురు
నాగర్ కర్నూల్, వెలుగు:ఎడతెరిపి లేని వర్షాలు ఉమ్మడి జిల్లా ప్రజలను ఆగం చేస్తున్నాయి. వాగులు ఉప్పొంగి పారుతుండడంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండి పోవాల్సి వస్తోంది. ఎక్కువగా కాజ్‌వేలు, కల్వర్టులే ఉండడం కారణంగా వరద రోడ్డుపై నుంచి పారుతుండడంతో 50కిపైగా గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయి. రైతులు, కూలీలు పొలాల వద్దకు వెళ్లేందుకు కూడా నానా అవస్థలు పడుతున్నారు. రెండు రోజుల క్రితం నార్లాపూర్, ముక్కిడిగుండం మధ్యలో వాగు ఉధృతంగా పారడంతో పొలం పనులకు వెళ్లిన రైతులు, కూలీలను ప్రొక్లెయిన్ బొక్కెనలో కూర్చోబెట్టి వాగు దాటించారు.
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకుంటలే..
ఐదురోజుల కింద ఆత్మకూరుకు చెందిన ప్రైవేట్ లెక్చరర్ ఆకుల కురుమూర్తి (30) బైక్‌తో సరళాసాగర్ వాగు దాటుతుండగా కొట్టుకుపోయాడు. రెండు రోజుల తర్వాత గోపాల్ పేట శివారులో నీటిపై డెడ్‌బాడీ దొరికింది. పది రోజుల కింద ఊట్కూర్ మండలం అమీన్‌పురానికి చెందిన చాపలి రాము(36) తన కొడుకుకు పాలు తీసుకొచ్చేందుకు బైక్‌పై సామనూరుకు వెళ్తుండగా మధ్యలో ఉన్న వాగులో కొట్టుకుపోయాడు. కంపచెట్లు అడ్డుకోవడంతో ఈదుకుంటూ బయటపడ్డాడు. వారం కింద తాడూరు మండలం నాగదేవుని పల్లికి చెందిన పెంటయ్య(40), మరో వ్యక్తి మహేందర్ బైక్‌పై వాగు దాటుతుండగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇందులో పెంటయ్య మృతిచెందగా.. మహేందర్ బయటపడ్డాడు. ఐతోల్ శిరసవాడ గ్రామాల మధ్య వాగు దాటుతుండగా నలుగురు వెళ్తున్న కారు నిలిచిపోయింది. స్థానికులు టాక్టర్ సాయంతో కారును బయటకు లాగారు. రెండు వారాల కింద కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద దుందుభి వాగు దాటేందుకు ప్రయత్నించిన అచ్చంపేట ఆర్టీసీ బస్సు మధ్యలో ఆగిపోయింది.
ఉధృతంగా దుందుభి
దుందుభి వాగు ఉధృతంగా పారుతుండడంతో నాగర్ కర్నూల్ జిల్లాలో పదుల చోట్ల రూట్లు బంద్ అయ్యాయి. సిర్సవాడ, రఘుపతిపేట, డిండి చింతపల్లి, ఉల్పర, సిర్సవాడ, ఐతోలు వద్ద వాగు దాటనివ్వడం లేదు. ఈ రూట్లలో ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. కొల్లపూర్‌లో మండలం కోడేరు, -పెద్దకొత్తపల్లి మధ్య ఊరవాగు పొంగడంతో రవాణా స్తంభించింది. నార్లాపూర్ పరిధిలోని ఉడుముల వాగు ఉధృతితో ముక్కుడిగుండం, గేమ్యానాయక్ తండా, మొలచింతలపల్లి గ్రామాల నుంచి కొల్లాపూర్‌కు వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. లింగాల, వెల్దండ మండలంలో బైరాపూర్ వాగు పొంగడంతో చారకొండ మండలానికి సంబంధాలు కట్ అయ్యాయి.
రాకపోకలు బంద్
సరళాసాగర్ సైఫన్లు తెరుచుకున్న ప్రతిసారి వరద రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండడంతో ఆత్మకూరు, మదనాపురం మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో అడ్డాకుల మండలం వర్నె ముత్యాలంపల్లి గ్రామాల మధ్య ఊక చెట్టు వాగు, దేవరకద్ర మండలం కౌకుంట్ల, ఇస్రంపల్లి మధ్య ఉన్న ఇశ్రంపల్లి వాగు పొంగుతుండడంతో నాలుగు గ్రామాలకు సంబంధాలు కట్ అవుతున్నాయి. నారాయణపేట జిల్లా నర్వ మండలంలో సీపురం, కల్వాల్, పెద్ద కడమూర్, కొత్తపల్లి, మగనూర్ మండలం సత్యరం, కోల్పోర్, మందిపాల్, గజరం దొడ్డి, వర్కూర్, నేరడగం, ఉజ్జెలి, బైరంపల్లి, మక్తల్ మండలంలో మంథన్ గోడ్, గొల్లపల్లి, కర్ని, ఊట్కూర్ మండలం సమస్తాపూర్, మల్లెపల్లి, వల్లంపల్లి, పెద్దపొర్ల, బిజ్వార్, పులిమామిడి, ఊట్కూర్ మండలం అమీన్ పూర్, సామనూర్ గ్రామాలపై వరద ప్రభావం పడుతోంది. గద్వాల జిల్లాలో మానవపాడు, అమరవాయి మధ్య, చెన్నిపాడు, పోతులపాడు మధ్య, రాయచూరు ప్రధాన రహదారి బొంకూరు వద్ద వాగులు పొంగుతుండడంతో రాకపోకలు బంద్ అవుతున్నాయి. అయిజ పట్టణ సమీపంలోని పోలోని, నాగర్ దొడ్డి, ఉత్తనూర్, టీటీ దొడ్డి వాగులు పారుతుండడంతో తుప్పత్రాల, మేడికొండ, పులికల్, రాజాపురం, బైనపల్లి, తూముకుంట, విఠలాపురం, మల్లెం దొడ్డి, ఏలుకూరు, ఉత్తనూరు, భూమ్ పురం, ముగోనిపల్లె , అంతంపల్లి , టీటీ దొడ్డి, సిందనూరు, కుట్కనూరు గ్రామాలకు రవాణా స్తంభిస్తోంది.
కొత్త బ్రిడ్జిలు లేవు.. పాత బ్రిడ్జిలు పెండింగ్‌లోనే..
వాగుల కారణంగా 50కి పైగా గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నా సర్కారు బ్రిడ్జిలు మంజూరు చేయడం లేదు. మంజూరు చేసిన బ్రిడ్జిలను కూడా కంప్లీట్ చేయడం లేదు. కొల్లూపూర్ మండలం ముక్కిడి గుండం–నార్లాపూర్ మధ్య బ్రిడ్జి 20 ఏళ్ల కింద మంజూరైనా.. ఫండ్స్ పరిపోవని కాంట్రాక్టర్ వదిలేశాడు. సరళా సాగర్ వాగుపై పదేళ్ల కింద బ్రిడ్జి మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదు. మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డి పల్లి ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేసినా.. పనులు మొదలు పెట్టలేదు. కర్నూల్–రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారిపై బ్రిడ్జి పెండింగ్‌లో ఉండడంతో పెద్దవాగు పొంగినప్పుడల్లా రవాణా స్తంభిస్తోంది.