తాగొచ్చి వేధిస్తున్నడని భర్తను చంపిన భార్య

  • ఈ నెల 14న జరిగిన హత్య కేసును ఛేదించిన శంషాబాద్ పోలీసులు

శంషాబాద్, వెలుగు: పదిహేను రోజుల కిందట శంషాబాద్ పరిధి జూకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తాగొచ్చి వేధిస్తున్నడని భర్తను భార్యే చంపినట్లు తేల్చి ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన గడ్డిరాజు వెంకట నాగరాజు(60), నాగమణి దంపతులు బతుకుదెరువు కోసం సిటీకి వచ్చి శంషాబాద్ మండలంలోని జుకల్ గ్రామంలో ఉంటున్నారు. జుకల్ లో చందర్ రావు అనే వ్యక్తికి చెందిన ఎకరం స్థలంలో మామిడి తోట ఉండగా.. నాగరాజు అక్కడ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు.

ఈ నెల 14న రాత్రి తోటలో నాగరాజు హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు తోట దగ్గరికి వచ్చి నాగరాజుపై దాడి చేయగా అతడు చనిపోయాడని.. తన మొహంపై స్ప్రే కొట్టి.. మెడలోని పుస్తెల తాడును లాక్కుని సదరు వ్యక్తులు పారిపోయారని నాగలక్ష్మి పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్ లో పేర్కొంది. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 30 నాగమణిపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. రోజూ తాగొచ్చి వేధిస్తున్నడని తానే గొడ్డలితో భర్తను చంపినట్లు నాగమణి పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకుంది. ఆమె పుస్తెల తాడును మామిడి తోటలో దాచిపెట్టగా.. పోలీసులు రికవరీ చేశారు. నాగమణిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.