
దేశంలో మొదటి వ్యవసాయ విధానాన్ని 1993లో ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తి వార్షిక వృద్ధిరేటు 2.6శాతం నుంచి 3.5శాతానికి పెంచాలనేది తొలి వ్యవసాయ విధానం ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం, సహకార సంఘాలు బలోపేతం చేయడం, ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం పెంచడం దీని లక్ష్యం.
జాతీయ వ్యవసాయ విధానం - 2000
2000 జులై 28న జాతీయ వ్యవసాయ విధానాన్ని ప్రకటించారు. ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలకు అనుగుణంగా ఉంది. రాబోయే రెండు దశాబ్దాల్లో నాలుగు శాతంపైన వృద్ధి సాధించడం, ఒకే గొడుగు కింద బీమా అమలు చేయడం, ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించడం, నూతన వంగడాల సృష్టికి ప్రాధాన్యం, ఎస్ఆర్ఐ (సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్) తదితర వరిసాగు విధానాల్లో పరిశోధనలు చేయడం జాతీయ వ్యవసాయ విధానం లక్ష్యాలుగా నిర్దేశించారు.
జాతీయ రైతు కమిషన్ - 2004
రైతులకు వ్యవసాయ రంగానికి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన జాతీయ రైతు కమిషన్ 2004లో నియమించారు. భూమి లేని వ్యవసాయ కూలీలను, కౌలుదారులను, ఉపాంత రైతులు, చిన్న రైతులు, పెద్ద రైతులు, పశుపోషణలో ఉన్న రైతులను రైతులుగా పరిగణించాలని పేర్కొన్నారు. వ్యవసాయ పునరుద్దరణ కార్యాచరణ ప్రణాళికను ఐదు అంశాల్లో ప్రకటించారు.
భూసారం పెంపొందించడం, నీటి సంరక్షణ, పరపతి, బీమా సదుపాయాలు కల్పించడం, ఉత్పత్తి, ఉత్పత్తి అనంతర కార్యకలాపాలు అనుసంధానం చేయడం, ఉత్పత్తిదారుడు పొందే ధరకు, వినియోగదారుడు చెల్లించే ధరకు మధ్య అంతరం తగ్గించాలి. స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం 2006, జూన్ 1న 2006–07 సంవత్సరాన్ని వ్యవసాయ పునరుద్ధరణ సంవత్సరంగా ప్రకటించారు.
రెండో హరిత విప్లవం - 2006
2006లో ప్రధాని మన్మోహన్ సింగ్ రెండో హరిత విప్లవానికి పిలుపు ఇచ్చారు. స్వామినాథన్ కమిషన్ ఐదు సిఫారసులకు అదనంగా మరో రెండింటిని ప్రధాన మంత్రి సూచించారు. విత్తనాల వృద్ధికి విజ్ఞానశాస్త్రం, బయోటెక్నాలజీని ఉపయోగించడం, పశుగణాల ఉత్పాదకత పెంచడానికి విజ్ఞానశాస్త్రం ఉపయోగించడం మొదటి హరిత విప్లవం భూస్వాములకు, పెద్ద రైతులకు ప్రయోజనం చేకూర్చింది. మెట్ట ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే, హరిత విప్లవం ఉపాంత రైతులకు చిన్న రైతులకు లబ్ధి చేకూర్చాలి.
రసాయనిక ఎరువుల స్థానంలో జీవ సంబంధ ఎరువులు, క్రిమి సంహారక మందుల స్థానంలో బయో పెస్టిసైడ్స్ను ఉపయోగించాలని ఇందులో సూచించారు. విత్తనాల అభివృద్ధిలో బయోటెక్నాలజీ వాడకాన్ని ఇందులో సూచించారు. తూర్పు భారతదేశంలో పంటల ఉత్పాదకతను పెంచడానికి ప్రాధాన్యతను ఇస్తూ రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా 2010–11లో బీజీఆర్ఈఐ (బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఈస్టర్న్ ఇండియా)ను ప్రారంభించారు.
ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ : దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని 210 మిలియన్ టన్నుల నుంచి 420 మిలియన్ టన్నుల స్థాయికి పెంచడానికి ఎవర్గ్రీన్ రెవెల్యూషన్కు శ్రీకారం చుట్టాలని జాతీయ వ్యవసాయ కమిషన్ అధ్యక్షుడు స్వామినాథన్ పిలుపుఇచ్చారు. శాస్త్రీయ సాంకేతిక పద్ధతులతోపాటు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు.
ట్రై కలర్ రెవల్యూషన్ : ప్రధాని నరేంద్ర మోడీ 2014లో త్రివర్ణ విప్లవానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రోటీన్లు అధికంగా ఉన్న పప్పుధాన్యాలు, పశుసంపద, సంక్షేమం, సౌరశక్తి, వినియోగంతోపాటు పరిశుభ్రమైన నీరు, మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు.
రైతులపై విధానం - 2007
రైతులపై నియమించిన జాతీయ వ్యవసాయ కమిషన్ సిఫారసులను, రాష్ట్ర ప్రభుత్వంతో చేసిన సంప్రదింపులను దృష్టిలో పెట్టుకొని 2007 సంవత్సరంలో రైతులపై జాతీయ విధానం ప్రకటించారు. రైతుల పంట ఉత్పత్తి, ఉత్పాదకాలతోపాటు వారి ఆర్థిక సంక్షేమంపై దృష్టి సారించాలి. రైతులు బి.టి. అండ్ ఐటీ (బయో టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలను, పరపతి, బీమాను అందించాలి.