90 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు!

  • ఈ ఏడాది చేరుకుంటాం: ఐఏఎంఏఐ– కాంతార్‌‌‌‌ రిపోర్ట్

న్యూఢిల్లీ: ఇండియాలో ఇంటర్నెట్ వాడుతున్నవారి సంఖ్య ఈ ఏడాది 90 కోట్లకు చేరుకుంటుందని ఇంటర్నెట్‌‌ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), కాంతార్ కలిసి విడుదల చేసిన రిపోర్ట్ అంచనా వేసింది. కిందటేడాది యాక్టివ్‌‌గా ఇంటర్నెట్ వాడుతున్నవారి సంఖ్య 88.6 కోట్లకు పెరిగిందని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే  8 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. దేశీయ  భాషల్లో ఆన్‌‌లైన్‌‌ సైట్లు అందుబాటులో  ఉండడంతో ఇంటర్నెట్ వాడకం పెరుగుతోందని తెలిపింది. 

ఇంటర్నెట్ యూజర్లలో 98 శాతం మందికి తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో  కంటెంట్ అందుబాటులో ఉందని వివరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడుతున్నవారి సంఖ్య కిందటి నెల ముగిసేనాటికి 48.88 కోట్లకు చేరుకుంది. దేశం మొత్తం మీద ఇంటర్నెట్ వాడుతున్నవారిలో వీరి వాటా 55 శాతంగా ఉంది.  పట్టణాల్లోని ఇంటర్నెట్ యూజర్లలో 57 శాతం మంది  ప్రాంతీయ భాషల్లోనే ఇంటర్నెట్‌‌ను వాడుతున్నారు.  

లోకల్ లాంగ్వేజ్‌‌లకు, కంటెంట్‌‌కు ఉన్న డిమాండ్‌‌ను ఇది తెలియజేస్తోంది. ఇంటర్నెట్ వాడుతున్నవారిలో 47 శాతం మంది మహిళలు ఉన్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఇంటర్నెట్ యూజర్లు వేగంగా పెరుగుతున్నారు. పట్టణాల్లో మాత్రం స్మార్ట్‌‌ టీవీలు, స్మార్ట్ స్పీకర్లు వంటి డివైజ్‌‌ల వాడకం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటీటీ వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్‌‌, ఆన్‌‌లైన్ కమ్యూనికేషన్‌‌, సొషల్ మీడియా వంటి వాటి కోసం ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతున్నారు.