టీమిండియా అమ్మాయిల ఆట, రాత మారలేదు.. మూడో వన్డేలోనూ ఓటమి.. ఆసీస్ చేతిలో వైట్ వాష్

టీమిండియా అమ్మాయిల ఆట, రాత మారలేదు.. మూడో వన్డేలోనూ ఓటమి.. ఆసీస్ చేతిలో వైట్ వాష్
  • మూడో వన్డేలో 83 రన్స్ తేడాతో ఇండియా చిత్తు
  • స్మృతి సెంచరీ, అరుంధతి పోరాటం వృథా
  • 3–0తో సిరీస్‌‌‌‌ క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసిన ఆస్ట్రేలియా

పెర్త్‌‌‌‌: అదే కథ. అదే వ్యథ. టీమిండియా అమ్మాయిల ఆట, రాత మారలేదు. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (109 బాల్స్‌‌‌‌లో 14 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 105) సూపర్ సెంచరీతో సత్తా చాటినా, హైదరాబాదీ అరుంధతి రెడ్డి (4/26)  కెరీర్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌తో మెరిసినా ఆస్ట్రేలియా చేతిలో వైట్‌‌‌‌వాష్ తప్పలేదు. బుధవారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఇండియా 83 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. అనాబెల్ సదర్లాండ్ (95 బాల్స్‌‌‌‌లో  9 ఫోర్లు, 4 సిక్సర్లతో 110) సెంచరీకి తోడు ఆష్లే గార్డ్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ (5/30) ఐదు వికెట్లతో విజృంభించడంతో ఈ సిరీస్‌‌‌‌ను ఆసీస్‌‌‌‌ అమ్మాయిలు 3–0తో వైట్‌‌‌‌వాష్‌‌‌‌ చేశారు. 

తొలుత ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 298/6 స్కోరు చేసింది. సదర్లాండ్‌‌‌‌కు తోడు  కెప్టెన్ తహ్లియా మెక్‌‌‌‌గ్రాత్ (56 నాటౌట్‌‌‌‌), గార్డ్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ (50) ఫిఫ్టీలతో రాణించారు. ఇండియా బౌలర్లలో అరుంధతి 4 , దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు. ఛేజింగ్‌‌‌‌లో ఇండియా 45.1 ఓవర్లలో 215 స్కోరు మాత్రమే చేసి ఓడింది. మంధాన, హర్లీన్‌‌‌‌ డియోల్ (39) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు.  సదర్లాండ్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌, సిరీస్ అవార్డులు లభించాయి.

అరుంధతి జోరు.. సదర్లాండ్‌‌‌‌ ధమాకా

హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి వరుసబెట్టి నాలుగు వికెట్లు పడగొట్టినా మిగతా బౌలర్లు తేలిపోవడంతో ఆస్ట్రేలియా మంచి స్కోరు చేసింది.  ఓ దశలో 78/4 స్కోరుతో నిలిచి జట్టును గార్డ్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌, తహ్లియా తోడుగా  సదర్లాండ్‌‌‌‌ ఆదుకుంది. టాస్ ఓడిన కంగారూ బ్యాటింగ్‌‌‌‌కు రాగా.. ఓపెనర్లు లిచ్‌‌‌‌ఫీల్డ్ (28), జార్జియా వోల్‌‌‌‌ (26)   తొలి వికెట్‌‌‌‌కు 58 రన్స్ జోడించారు. కానీ,  పవర్‌‌‌‌‌‌‌‌ ప్లే తర్వాత అరుంధతి అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేసి కంగారూలను వణికించింది.  స్పెల్‌‌‌‌లో  స్వింగ్‌‌‌‌, ఫుల్‌‌‌‌ లెంగ్త్ బాల్స్‌‌‌‌తో ఇబ్బంది పెట్టింది. 

11వ ఓవర్లో నాలుగు బాల్స్ తేడాతో ఓపెనర్లిద్దరినీ ఔట్‌‌‌‌ చేసి ఇండియాకు బ్రేక్ ఇచ్చింది. కాసేపటికే మరో అద్భుతమైన డెలివరీతో సూపర్ ఫామ్‌‌‌‌లో ఉన్న ఎలీస్ పెర్రీ (4 )ని బౌల్డ్ చేసిన అరుంధతి మరుసటి ఓవర్లోనే బెత్‌‌‌‌ మూనీ (10)ని కూడా పెవిలియన్‌‌‌‌ చేర్చి కంగారూ టీమ్‌‌‌‌కు షాకిచ్చింది. కానీ, అరుంధతి బౌలింగ్‌‌‌‌లో జాగ్రత్త పడ్డ సదర్లాండ్‌‌‌‌, గార్డ్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ మిగతా బౌలర్లను టార్గెట్ చేశారు. స్పిన్నర్లపై సదర్లాండ్‌‌ ఎదురుదాడి చేసింది. గార్డ్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌తో ఐదో వికెట్‌‌‌‌కు 96 రన్స్,  కెప్టెన్ తహ్లియాతో ఆరో వికెట్‌‌‌‌కు 122 రన్స్ జోడించింది. దీప్తి వేసిన చివరి ఓవర్లో సిక్స్‌‌‌‌తో సెంచరీ పూర్తి చేసుకొని జట్టుకు మంచి స్కోరు అందించింది.మరోసారి తేలిపోయిన ఇండియా ఫీల్డర్లు మూడు క్యాచ్‌‌‌‌లు డ్రాప్ చేశారు. 

మంధాన ఒంటరి పోరాటం

భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో ఇండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో వన్డేలో ఫిఫ్టీతో రాణించిన  రిచా ఘోష్ (2)ను ఐదో ఓవర్లో మేగన్ బౌల్డ్ చేసింది. గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో నిరాశపరిచిన మంధాన ఈసారి ఫామ్‌‌‌‌లోకి వచ్చింది. తను అద్భుతమైన షాట్లతో అలరించగా.. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన హర్లీన్‌‌‌‌ డియోల్ జాగ్రత్తగా ఆడుతూ మంధానకు సపోర్ట్ ఇచ్చింది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌‌‌‌కు 118 రన్స్ జోడించడంతో ఇండియా గెలుపు దిశగా పయనించింది. కానీ, 28వ ఓవర్లో అలానాకు రిటర్న్‌‌‌‌ క్యాచ్ ఇచ్చిన డియోల్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌ చేరిన తర్వాత ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌ ఒక్కసారిగా డీలా పడింది. 

ఆసీస్ బౌలర్లు జోరు పెంచగా.. మిడిల్‌‌‌‌, లోయర్ ఆర్డర్ బ్యాటర్లంతా పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టారు. కెప్టెన్ హర్మన్ (12), జెమీమా (16)  నిరాశపరిచారు. సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే గార్డ్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ టర్నింగ్‌‌‌‌ను అర్థం చేసుకోలేక మంధాన బౌల్డ్ అయింది. ఇక్కడి నుంచి ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌ పేకమేడను తలపించింది. 30 రన్స్ తేడాలో చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.  గార్డ్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ దెబ్బకు ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మ (0) డకౌటవ్వగా.. మిన్ను మణి (8), అరుంధతి (5), సైమా (0) బ్యాట్లెత్తేశారు. టిటాస్‌‌‌‌ (3)ను ఆఖరి వికెట్‌‌‌‌గా ఔట్ చేసిన అలానా మ్యాచ్ ముగించింది.

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో 298/6 (సదర్లాండ్‌‌‌‌ 110, తహ్లియా 56*, గార్డ్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ 50, అరుంధతి రెడ్డి 4/26)
ఇండియా:45.1 ఓవర్లలో 215 ఆలౌట్ (మంధాన 105, హర్లీన్‌‌‌‌ 39, గార్డ్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ 5/30, మేగన్ 2/26).