వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ అంటే ఏ జట్టయినా కంగారు పడాల్సిందే. దీనికి భారత్ కూడా మినహాయింపేమీ కాదు. స్వదేశంలో మ్యాచ్ జరుగుతున్నా.. చెన్నై లాంటి స్పిన్ ట్రాక్ పై తొలి మ్యాచ్ అయినా భారత్ గెలుపై అందరిలో కొంచెం సందేహం కలిగింది. అయితే ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారత జట్టు అసలు పవర్ ఏంటో తెలిసింది. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్, హాట్ ఫేవరేట్ ఆస్ట్రేలియాని 199 పరుగులకే ఆలౌట్ చేసి అభిమానుల్లో విజయంపై ధీమా పెంచారు.
ALSO READ : Cricket World Cup 2023: జడేజా తిప్పేసాడు: 10 బంతుల్లోనే 3 కీలక వికెట్లు
చెన్నై చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ కి ఆరంభంలోనే మిట్చెల్ మార్ష్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సీనియర్ ప్లేయర్ల స్మిత్ (46) వార్నర్ (41) మంచి భాగస్వామ్యం నిర్మించినా అది జట్టు భారీ స్కోర్ కి ఏ మాత్రం సరిపోలేదు. క్రీజ్ లో ఉన్నంతవరకు ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఒక్కసారిగా ఔటైన తర్వాత ఆసీస్ పతనం మొదలయింది. భారత స్పిన్నర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వస్తుంది.
ఒకదశలో 110/ 2 పటిష్ట స్థితిలో నిలిచినా ఆసీస్ 140/7 తో పీకల్లోతూ కష్టాల్లో నిలిచింది. చివర్లో స్టార్క్ 24 పరుగులతో రాణించడంతో భారత్ ముందు 200 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో జడేజాకు మూడు వికెట్లు తీసుకోగా.. కుల్దీప్, బుమ్రాకి తలో రెండు వికెట్లు దక్కాయి. అశ్విన్,సిరాజ్, హార్దిక్ పాండ్య ఒక వికెట్ తీసుకున్నారు