టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కోహ్లీ తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇక రోహిత్ విషయానికి వస్తే ఐర్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ మినహాయిస్తే పెద్దగా రాణించింది ఏమీ లేదు. జట్టులో సీనియర్ ప్లేయర్లుగా ఎంతో అనుభవం ఉన్న ఈ టాప్ బ్యాటర్లు తరచూ విఫలమవుతూ జట్టును కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. సూపర్ 8 వచ్చినా వీరు తీరు మారడం లేదు.
పాకిస్తాన్‌పై రోహిత్, కోహ్లీ జోడించిన 12 రన్సే తొలి వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం. మిడిలార్డర్‌లో ఎవరో ఒకరు ఆదుకోవడం.. బౌలర్లు అద్భుత పెర్ఫామెన్స్ చేస్తుండటంతో ఇండియా ముందుకొస్తోంది. తొలి రౌండ్‌లో 1, 4, 0 స్కోర్లతో నిరాశ పరిచిన విరాట్ కోహ్లీ.. సూపర్ 8లో 24 బంతుల్లో 24 రన్స్ చేశాడు. ఈ ఫార్మాట్‌కు ఈ స్ట్రయిక్ రేట్ ఏమాత్రం సరిపోదు. రోహిత్ విషయానికి వస్తే ఐర్లాండ్‌పై ఫిఫ్టీ తర్వాత చివరి మూడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 13, 3, 8 స్కోర్లతో ఫెయిలయ్యాడు. ఇప్పటివరకు వీరిద్దరూ ఎలా ఆడినా చిన్న జట్లు కావడంతో వీరి ఫామ్ లేమి పెద్ద సమస్య కాలేదు.
బంగ్లాదేశ్ తో ఆంటిగ్వా వేదికగా శనివారం (జూన్ 22) కీలకమైన సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది. బంగ్లాదేశ్ ఈ టోర్నీలో బౌలింగ్ తో అదరగొడుతుంది. టాంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్మిన్ అహ్మద్, షకీబ్ ఉల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్ లతో బౌలింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తుంది. తమ బౌలింగ్ తో లో స్కోరింగ్ మ్యాచ్ లను బంగ్లా డిఫెండ్ చేసుకుంది. భారత్ పై సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.
సెమీస్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ భారత్ కు చాలా కీలకం. ఒకవేళ పొరపాటున ఈ మ్యాచ్ లో ఓడిపోతే చివరి మ్యాచ్ పటిష్టమైన ఆస్టేలియాతో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. దీంతో ఇక్కడే మ్యాచ్ ను ముగించాలంటే విరాట్ కోహ్లీ, రోహిత్ ఫామ్ లోకి రావడం అవసరం. భారత్ బ్యాటింగ్ మొత్తం సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ లపైనే ఆధారపడి ఉంది. వీరిద్దరూ ఫామ్ లోనే ఉండడం భారత్ కు కలిసి కలిసి వచ్చే అంశం. సూర్య వరుసగా రెండు మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీ చేసి ఊపు మీద ఉన్నాడు. మరోవైపు పంత్ ప్రతి మ్యాచ్ లోనూ నిలకడగా రాణిస్తున్నాడు.