IND vs AUS: కొంప ముంచిన జైస్వాల్‌‌ రనౌట్‌.. టీమిండియా ఎదురీత

IND vs AUS: కొంప ముంచిన జైస్వాల్‌‌ రనౌట్‌.. టీమిండియా ఎదురీత

ఆసీస్‌‌ భారీ స్కోరు చేసిన వికెట్‌‌పై ఇండియాకు శుభారంభం దక్కలేదు. తిరిగి ఓపెనర్‌‌‌‌గా బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ పేలవ ఫామ్‌‌ను కొనసాగించాడు. కమిన్స్‌‌ వేసిన రెండో ఓవర్లోనే షార్ట్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌ను నిర్లక్ష్యంగా పుల్ చేసి బోలాండ్‌కు క్యాచ్ ఇచ్చాడు. మరో ఓపెనర్‌‌‌‌ జైస్వాల్‌‌, రాహుల్ సాధికారంగా ఆడుతూ స్కోరు 50 దాటించారు. కానీ, క్రీజులో కుదురుకున్న రాహుల్‌‌ను 15వ  ఓవర్లో  కమిన్స్‌‌ అద్భుతమైన డెలివరీతో బౌల్డ్‌‌ చేయడంతో ఇండియా 51/2తో టీకి వెళ్లింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ జాగ్రత్తగా బ్యాటింగ్‌‌ చేశాడు. ఆఫ్​ స్టంప్‌‌ బాల్స్‌‌ను పూర్తిగా వదిలేస్తూ క్రీజులో కుదురుకున్నాడు. 

మరో ఎండ్‌‌లో జోరు కొనసాగించిన యశస్వి కట్‌‌, పుల్‌‌, డ్రైవ్స్‌‌తో ఆకట్టుకుంటూ 81 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ మంచి సమన్వయంతో ఆడుతూ స్కోరు 150 దాటించారు. సెంచరీ (102) భాగస్వామ్యం కూడా పూర్తిచేశారు. అయితే, అంతా సాఫీగా సాగుతున్న సమయంలో  ఓ రనౌట్‌‌ జట్టును దెబ్బతీసింది. బోలాండ్‌‌ వేసిన బాల్‌‌ను మిడాన్‌‌ మీదుగా ఆడిన జైస్వాల్‌‌ లేని సింగిల్ కోసం ప్రయత్నించాడు. కోహ్లీ కూడా పరుగెత్తి వెంటనే వెనక్కి వచ్చేశాడు. దీన్ని గమనించకుండా దాదాపు నాన్ స్ట్రయికింగ్‌‌ ఎండ్‌‌ వరకూ వచ్చేసిన జైస్వాల్‌ రనౌటై నిరాశతో క్రీజు వీడాడు.  దీనికి కారణమైన కోహ్లీ ఏకాగ్రత కోల్పోయాడు. కాసేపటికే బోలాండ్‌‌ ఆఫ్ స్టంప్‌ బాల్‌‌ను వెంటాడి కీపర్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. తన తర్వాతి ఓవర్లోనే నైట్ వాచ్‌ మన్‌గా వచ్చిన  ఆకాశ్ దీప్‌‌ (0) ను బోలాండ్ ఔట్‌‌ చేశాడు. దాంతో 21 బాల్స్ తేడాతో  3 వికెట్లు పడటంతో ఇండియా ఆత్మరక్షణలో పడింది. మరో 9 బాల్స్‌‌లో పంత్‌‌, జడేజా వికెట్‌‌ ఇవ్వకుండా  రోజును ముగించారు.