Team India: బార్బడోస్‌ to ఢిల్లీ.. స్వదేశానికి బయలుదేరిన భారత జట్టు

Team India: బార్బడోస్‌ to ఢిల్లీ.. స్వదేశానికి బయలుదేరిన భారత జట్టు

బెరిల్‌ హరికేన్‌ ప్రభావంతో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన భారత క్రికెట్‌ బృందం ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన స్పెషల్ ఫ్లైట్‌లో వీరు భారత్‌కు పయనమయ్యారు. క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది సహా బీసీసీఐ బృందం, స్పోర్ట్స్‌ జర్నలిస్టులు కలిపి దాదాపు విమానంలో 70 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానం గురువారం(జులై 4) ఉదయం 6 గంటలకల్లా ఢిల్లీ చేరుకోనుంది.

బార్బడోస్ వేదికగా గత నెల 29(శనివారం)న దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ జట్టు విజయం సాధించింది. ఆఖరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠను పంచిన ఫైనల్‌ పోరులో రోహిత్ సేన 7 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేయగా.. ఛేదనలో సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా, భారత జట్టు రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.

నాలుగు రోజులుగా హోటల్‌లోనే.. 

ఫైనల్ ముగిసిన అనంతరం భారత్ బృందం జులై 1న స్వదేశానికి బయలుదేరి రావాల్సి ఉంది. అయితే, బార్బడోస్‌లో బెరిల్‌ తుఫాన్‌  బీభత్సం సృష్టించడంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. దాంతో ఆటగాళ్లు, వారి కుటుంబసభ్యులు, సహాయక సిబ్బంది అందరూ అక్కడ చిక్కుకుపోయారు. చివరకు బీసీసీఐ కల్పించుకొని స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేయడంతో వారి రాకకు మార్గం సుగుమైంది. విశ్వ విజేతగా నిలిచిన రోహిత్ సేనకు ఘన స్వాగతం పలికేందుకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆటగాళ్లను కలిసి అభినందించనున్నారు.