
కొలంబో: భారత్కు చెందిన 11 మంది జాలర్లను ఆదివారం శ్రీలంక విడుదల చేసింది. మత్స్యకారుల వివాదాలను మానవతా దృక్పథంలో పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వెంటనే ఈ పరిణామం చోటుచేసుకుంది. శనివారం మోదీ, శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే మధ్య జరిగిన చర్చలలో మత్స్యకారుల సమస్య ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించి మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని అంగీకరించాం. మత్స్యకారులు, వారి పడవలను వెంటనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం” అని పేర్కొన్నారు. మత్స్యకారుల విషయంలో భారత్, శ్రీలంకల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి. పాక్ జలసంధిలో వేటను కొనసాగిస్తున్నారంటూ భారత జాలర్లను శ్రీలంక నావికాదళ సిబ్బంది అనేక సార్లు అదుపులోకి తీసుకున్నారు.